AP CM Chandrababu Letter to CM Revanth Reddy : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆయన లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు కోరారు. విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
పరస్పర సహకారం, తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న మధ్యాహ్నం ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖ ద్వారా ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వెల్లడించారు.
Chandrababu Naidu Writes to Telangana CM Revanth : "తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, లీడర్షిప్ తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల సీఎంలుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయ్యింది. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి చాలా చర్చలు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు జరగబోయే మన మీటింగ్ మరో ఎత్తు. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది." అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అత్యవసరమన్న చంద్రబాబు, ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీ శనివారం కలిసి చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నట్లు తన లేఖలో రాసుకొచ్చారు. కేవలం ముఖాముఖి చర్యల ద్వారానే ఈ క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి, పరిష్కారాలను కనుగొనడానికి వీలవుతుందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. తమ చర్చల ద్వారా మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం, విశ్వాసం తనకుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. మరి చంద్రబాబు లేఖపై తెలంగాణ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేదీ ఆసక్తికరంగా మారింది.