Telugu Syllabus Issue for CBSE Students : ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. సీబీఎస్‌ఈలో పాత తెలుగు పాఠ్యపుస్తకం చదివిన విద్యార్థులు, ఇప్పుడు రాష్ట్ర బోర్డుకు మారినందున తెలుగు కొత్త పుస్తకం చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండున్నర నెలల్లోనే తెలుగు సబ్జెక్టును పూర్తి చేసి పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి వచ్చింది. ఎస్‌సీఈఆర్టీ తప్పిదం వల్ల ప్రభుత్వ బడుల్లోని 77,478 మంది పదో తరగతి పిల్లలు తెలుగు కొత్త పుస్తకం చదవాల్సి వస్తోంది.
సీబీఎస్‌ఈ నుంచి రాష్ట్ర బోర్డుకు :ఏపీలోని సీబీఎస్‌ఈ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగా లేవని, ఈ ఏడాది వారిని ఏపీ రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సీబీఎస్‌ఈకి పాత తెలుగు పాఠ్యపుస్తకం, రాష్ట్ర బోర్డు వారికి కొత్త పాఠ్యపుస్తకం అమలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటి వరకు సీబీఎస్‌ఈలో పాత తెలుగు పాఠ్యపుస్తకం చదివిన విద్యార్థులు ఇప్పుడు రాష్ట్ర బోర్డుకు మారినందున తెలుగు కొత్త పుస్తకం చదవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు :పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులతో సెప్టెంబర్ 17న టెలికాన్ఫరెన్సు నిర్వహించి సీబీఎస్‌ఈ వారికి కొత్త తెలుగు పాఠ్యపుస్తకాన్ని నవంబరు 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ అప్పటికీ కాకపోతే డిసెంబరు 5లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలంది. దీంతో రెండునెలల్లోనే పాఠాలు పూర్తి చేయడం వల్ల విద్యార్థులు సరిగా అర్థం కాదని, నోట్సులు రాసి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తుందని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.
అప్పటి ప్రభుత్వ నిర్లక్షంతో : తెలుగు పాఠ్యపుస్తకాన్ని మారుస్తున్నప్పుడు సీబీఎస్‌ఈకి ఎస్‌సీఈఆర్టీ సమాచారం అందించలేదు. తెలుగు సబ్జెక్టును ఎంచుకున్న వారికి పాత తెలుగు పుస్తకమే ఉంటుందని సీబీఎస్‌ఈ బోర్డు సమాచారం ఇచ్చింది. దీంతో బోర్డు విద్యార్థులంతా పాత తెలుగు పుస్తకమే చదువుతున్నారు. రాష్ట్ర బోర్డు విద్యార్థులకు మాత్రం కొత్త తెలుగు పుస్తకం ఇచ్చారు. ఎస్‌సీఈఆర్టీ చేసిన పనికి ప్రైవేటు బడుల్లోని సీబీఎస్‌ఈ విద్యార్థులు పాత పుస్తకాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ బడుల్లోని వారికి సర్కారే పాత పుస్తకాలను ముద్రించి ఆలస్యంగా పంపిణీ చేసింది. ఇప్పుడు బోర్డు మారడంతో ప్రభుత్వ బడుల్లోని 77,478 మంది పదో తరగతి పిల్లలు కొత్త పుస్తకాలు చదవాల్సి వస్తోంది.
పదో తరగతి పిల్లలపై ఒత్తిడి : విద్యార్థులపై ఒత్తిడి పెట్టకుండా ఈ ఒక్క ఏడాదీ సీబీఎస్‌ఈ వారికి పాత తెలుగు వాచకం ప్రకారం రాష్ట్ర బోర్డు వారికి కొత్త తెలుగు పుస్తకం ప్రకారం 2 రకాల ప్రశ్నపత్రాలను ముద్రించి ఇవ్వొచ్చు. కానీ దీనిపై విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే విద్యా సంవత్సరంలో 3 నెలలు గడిచిపోయాయి. పదో తరగతికి వారికి మార్చిలోనే ఫైనల్ పరీక్షలు ఉంటాయి. ఈలోపు కొత్త పుస్తకాల సిలబస్ పూర్తి చేయడం, విద్యార్థులు చదవడం కష్టంగా ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సీబీఎస్‌ఈలో ఐదు సబ్జెక్టుల విధానం కారణంగా హిందీ సబ్జెక్టుపై ఉపాధ్యాయులు పెద్దగా దృష్టి పెట్టలేదు. కేవలం అంతర్గత పరీక్షలకేనంటూ బోధించారు. ఇప్పుడు రాష్ట్ర బోర్డుకు మారినందున ఆరు సబ్జెక్టుల్లోనూ విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలి. దీంతో హిందీని కూడా సీరియస్‌గా చదవాల్సి ఉంటుంది.
మందుబాబులకు కిక్కే కిక్కు- సరసమైన ధరలకే లిక్కర్! - NEW LIQUOR POLICY IN AP
నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA