Kims Doctors Saved Snake Bite Boy Life : సాధారణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు పడతాయి. అలాగే కాటు పడిన ప్రాంతంలో వాపు, నొప్పి కూడా ఉంటాయి. కానీ కట్లపాము కాటేస్తే మాత్రం ఇవేవీ కనిపించవు. కానీ, ఆ తర్వాత కొంతసేపటికి వాంతులు, కడుపునొప్పి, గొంతు నొప్పి లాంటి సాధారణ లక్షణాలుంటాయి. ఇంకా ఎక్కువ సమయం అయితే అప్పుడు నరాల బలహీనత, ఊపిరి అందకపోవడం లాంటివి కనిపిస్తాయి.
అందుకే వీటిని పాము కాటుగా తల్లిదండ్రులే కాదు, సాధారణ వైద్యులు కూడా గుర్తించలేరు. సరిగ్గా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను పిల్లల వైద్య నిపుణుడు, డాక్టర్ ఎ. మహేశ్ తెలిపారు. 12 ఏళ్ల బాలుడు ఊపిరి సరిగా అందని పరిస్థితిలో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అప్పటికి అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ కేవలం 66% మాత్రమే ఉందని, చెస్ట్ ఎక్స్‌రే తీసి చూస్తే, న్యుమోనియా లక్షణాల లాంటివి కొన్ని కనిపించాయన్నారు. కానీ, ఒక రోజు ముందువరకు బాబుకు ఎలాంటి ఇబ్బందీ లేదని గమనించారు.
వెంటిలేటర్ అమర్చి, అత్యవసర చికిత్స మొదలు : అంటే న్యుమోనియాలో కనిపించే జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఒక్కటి కూడా లేవు. కానీ ఆక్సిజన్ శాచ్యురేషన్ బాగా తక్కువగా ఉండటంతో ముందుగా వెంటిలేటర్ అమర్చి, చికిత్స మొదలుపెట్టామన్నారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందని ఆరా తీశామని డాక్టర్ మహేశ్ తెలిపారు. ముందుగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాబుకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చిందని, ఆ తర్వాత వాంతులు కావడం మొదలుపెట్టాయని తెలుసుకున్నారు.