తెలంగాణ

telangana

ETV Bharat / state

స్టీరింగ్ పట్టిన అనంత అమ్మాయి - ఆర్టీసీలో చేరేందుకు శిక్షణ - Anantapur Lady Driver - ANANTAPUR LADY DRIVER

Lady Driver in Anantapur AP : తండ్రి ట్రాక్టర్‌ డ్రైవర్‌ నలుగురు సంతానం అందరూ ఆడబిడ్డలే. వారిది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో చిన్ననాటి నుంచే కుటుంబం ఈదుతున్న కష్టాల కడలిని కళ్లారా చూసిందా ఆ అమ్మాయి. కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయాలని డ్రైవింగ్‌కు దగ్గరైంది. దగ్గరవ్వడమే కాదు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని ఆర్టీసీలో పని చేసేందుకు శిక్షణ పొందుతోంది. మరి ఆ లేడీ డ్రైవర్‌ గురించి మేము చెప్పడం కాదు మీరే స్వయంగా చూడండి.

Anantapur Woman Got HV Driving License
Lady Driver in Anantapur AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 4:17 PM IST

Anantapur Lady Driver In AP: అమ్మాయిలు ఏ పని చేసినా అవహేళన చేసే రోజులివి. అందులోనూ డ్రైవింగ్‌ వృత్తిని ఎంచుకున్న ఈ యువతికి అంతకు మించిన అవమానాలు ఎదురయ్యాయి. అమ్మాయివి నీకెందుకు డ్రైవింగ్‌ వేరే పని చేసుకోవచ్చుగా అని సూటిపోటి మాటలతో ఎత్తి పొడిచారు. ఆ మాటలనే తన ఎదుగుదలకు బాటలుగా వేసుకుని విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటుందీ లేడీ డ్రైవర్‌.

Anantapur Woman Got HV Driving License :బొలెరో వాహనాన్ని నడుపుతున్న ఈ యువతి పేరు గంగోత్రి. ఏపీలోని అనంతపురం జిల్లా గూళ్యం గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు గంగన్న, రామాంజమ్మ. వీరికి నలుగురూ అడబిడ్డలే. ఈమె అందరికన్నా చిన్నది. బాల్యం నుంచే కుటుంబ కష్టాలను చూసిన గంగోత్రి అర్థికంగా కుటుంబాన్ని అండగా నిలవాలని భావించింది. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో డ్రైవింగ్​పై ఆ అమ్మాయి ఆసక్తి పెంచుకుంది.

డ్రైవింగ్​పై ఆసక్తి పెంచుకున్న గంగోత్రి :ఎలాగోలా కష్టపడి తండ్రి సహాయంతో గంగోత్రి ట్రాక్టర్‌ నేర్చుకుంది. అప్పటి నుంచి తన నాన్నతో కలిసి గ్రామంలోని పొలాలను దున్నడానికి వెళ్లేది. ఆ క్రమంలోనే ద్విచక్ర వాహనాన్నీ నేర్చుకుంది. దీంతో చిన్న అవసరాలకూ పక్కింటి ఎదురింటి వాళ్లను సాయం కోరాల్సిన పని లేకుండా పోయిందంటోంది గంగోత్రి.

"మా నాన్న చిన్నప్పటినుంచి బాగా కష్టపడి పెంచారు. మాకు బైక్ ఉండేది. ఎక్కడికైనా వెళ్లాలంటే పక్కింటి వారి సహాయంతో వెళ్లాల్సి వచ్చేది. మొదట నేను బొలెరో నేర్చుకున్నాను. ఆ తర్వాత బైక్ నేర్చుకున్నాను. ఇక అప్పటినుంచి డ్రైవింగ్​పై ఆసక్తి పెరిగింది. కుటుంబానికి కూడా అండగా ఉండవచ్చనే భావనతో బొలెరో వాహనాన్ని కొనుగోలు చేశాం. ఆ వాహనం మీద సరుకు రవాణా చేస్తున్నాం." - గంగోత్రి

మొదట లైట్ వెహికిల్‌ లైసెన్స్‌ తీసుకున్న గంగోత్రి :కూమార్తెపై దీమాతో గంగన్న బ్యాంకు నుంచి రుణం తీసుకుని బొలెరో వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆ వాహనాన్ని కూడా గంగోత్రికి నేర్పించి బెంగళూరు మార్కెట్‌కు కూరగాయల రవాణా ప్రారంభించాడు. తండ్రితోపాటు బెంగుళూరు మార్కెట్‌కు కూరగాయల లోడ్ తీసుకెళ్లడం అలవాటు చేసుకున్న ఆమె, అనతి కాలంలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి లైట్ వెహికిల్ లైసెన్సు పొంది దానిని ఏపీకి మార్చుకుంది.

"నేను ట్రాక్టర్ నడిపినప్పుడు నా వెంటే వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంది. ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకని అన్నారు. అయినా మా కుమార్తె పట్టు విడవకుండా డ్రైవింగ్ నేర్చుకుంది. బొలెరో వాహనాన్ని కొన్నాం. ఇప్పుడు తనే బెంగళూరు మార్కెట్​కు సరకు తీసుకెళ్తుంది. మా కుటుంబానికి ఆధారంగా ఉంటుంది." - గంగన్న, గంగోత్రి తండ్రి

లైట్ వెహికిల్‌ లైసెన్స్‌ తీసుకున్న గంగోత్రి అక్కడితో ఆగలేదు. ఎలాగైనా హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ తీసుకోవాలని భావించింది. అందుకోసం జిల్లాలోని ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌ అధికారులను సంప్రదించింది. బస్సు, లారీ వంటి వాహనాలను నేర్చుకోవాలంటే రూ.23,000లు ఫీజు చెల్లించాలని అధికారులు గంగోత్రికి చెప్పారు. దీంతో తల్లి దగ్గరున్న కొంత బంగారాన్ని తనాఖా పెట్టి వచ్చిన డబ్బుతో శిక్షణ కేంద్రానికి వెళ్లినట్లు ఆమె చెబుతోంది.

గంగోత్రికి డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కియా కార్ల పరిశ్రమ ఆర్థిక సహకారంతో సంభవ్‌ ఫౌండేషన్‌ హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ తీసుకునే యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుందని ఆమెకు చెప్పారు. గంగోత్రి వాళ్లను సంప్రదించడతో శిక్షణకు అయ్యే ఖర్చుతో పాటు ఉచిత భోజన వసతి కూడా కల్పించారు. ఒక మహిళా డ్రైవింగ్‌ వృత్తిలోకి రావడం గర్వించదగ్గ విషయమని ఆర్టీసీ, సంభవ్ ఫౌండేషన్‌ అధికారులు చెబుతున్నారు.

శిక్షణ అనంతరం ఆర్టీసీలో చేయడమే లక్ష్యం :సంభవ్ ఫౌండేషన్ నిర్వహించిన ఏడో బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణలో 15 మంది యువకులతో కలిసి గంగోత్రి డ్రైవింగ్ శిక్షణ పొందుతుంది. తొలి పరీక్షలోనే ఉత్తీర్ణత పొంది హెవీ వెహికిల్‌ లైసెన్స్ తీసుకుంది. కనీసం ఏడాదిన్నర డ్రైవింగ్ అనుభవం ఉంటేనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా తీసుకుంటారని చెప్పడంతో ప్రతిరోజు బెంగుళూరు మార్కెట్‌కు కూరగాయలు తీసుకెళ్తుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ ఎవ్వరూ ఊహించని రంగాన్ని ఎంచుకుంది గంగోత్రి. మహిళలు సైతం కూడా డ్రైవింగ్‌లో రాణించవచ్చని చాటిచెప్పుతూ హెవీ వెహికిల్‌ లైసెన్స్‌ను సంపాదించింది. శిక్షణ అనంతరం ఆర్టీసీలో చేరాలని గంగోత్రి భావిస్తోంది.

YUVA : చెక్క ట్రెడ్‌మిల్‌తో - కరెంటు బిల్లు మాయం - ఫిట్​నెస్ మాత్రం ఖాయం - WARANGAL MAN MAKES WOODEN TREADMILL

YUVA : మసకబారిన చేనేత వృత్తికి ఊపిరిపోయాలని సాఫ్ట్​వేర్​ కొలువు వదిలాడు - జాతీయస్థాయిలో అవార్డు సంపాదించాడు - National Handloom Award for mukesh

ABOUT THE AUTHOR

...view details