Boy Request to CM Revanth For Road : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త వర్షపు నీరుతో బురదమయంగా మారాయి. గుంతలుగా మారిన రోడ్లను చూసి 8 సంవత్సరాల విశ్వజిత్ అనే బాలుడు వినూత్నంగా తన విన్నపాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్నపం వీడియో కాస్త ప్రస్తుతం వైరల్గా మారింది.
జవహర్ నగర్ 28వ డివిజన్లోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయని, దాంతో వచ్చే పోయే వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారని తెలిపాడు. రోడ్లపై నడిచే పాదచారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదని వాపోయాడు.
"మా రోడ్లు చూశారా ఎంత దారుణంగా ఉన్నాయో? ఈ దారుల గుండా బడికి వెళ్లాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా మంది వాహనదారులు బైకులు స్కిడ్ అయి కిందపడుతున్నారు. రోడ్ల కోసం ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదు. మీరైనా పట్టించుకోండి రేవంత్రెడ్డి తాతయ్యా. గతంలో కేసీఆర్, మల్లారెడ్డి గెలిచారు. వాళ్లు ఏమీ చేయలేదు. మీరైనా కాస్త ఈ రోడ్ల పరిస్థితులపై ఆలోచన చేయండి. ప్లీజ్ ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్యా!" - విశ్వజిత్, బాలుడు