Amma Pade Jola Pata Singer Jahnavi Yerram Life Story : ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చి స్వరకల్పన చేయగా, జాహ్నవి యర్రం ఆలపించింది. మిట్టపల్లి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన గీతాలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకోగా, జాహ్నవికి మాత్రం ఇదే తొలిపాట.
మిట్టపల్లి చిక్కటి సాహిత్యానికి జాహ్నవి చక్కటి గాత్రం తోడుకావడంతో అమ్మ పాట యూట్యూబ్ వేదికగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అమ్మ పాటల్లో అద్భుతమైన పాటగా ప్రశంసలందుకుంటూ సూపర్ డూపర్ హిట్గా ట్రెండింగ్లో దూసుకుపోతుంది. 2024 మే 5న విడుదల చేసిన ఈ పాట 25 రోజుల్లోనే కోటికిపైగా వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాకుండా మ్యూజిక్ వీడియోల్లో టాప్ 10లో నిలిచింది.
Singer Jahnavi Yerram Biography :ఈ పాటలోని సాహిత్యాన్ని వర్ణిస్తే అతిశయోక్తిలా అనిపిస్తుంది. కానీ ఆ పాట పాడిన జాహ్నవి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జాహ్నవి ముంబయిలో పుట్టి పెరిగిన అమ్మాయి. తండ్రి చార్టెడ్ అకౌంట్, తల్లి గృహిణి. తొమ్మిదో తరగతి నుంచి జాహ్నవికి పాటలు పాడటమంటే ఇష్టం. సంగీతంపై మక్కువ పెంచుకుంది.
అది గ్రహించిన కుటుంబసభ్యులు, జాహ్నవిని ముంబయిలో ప్రఖ్యాత గాయకులు గులామ్ ముస్తఫా ఖాన్ సాబ్ వద్ద సంగీతం నేర్పించారు. సోనూ నిగమ్, హరిహరణ్ లాంటి గొప్ప గొప్ప గాయనీ గాయకులను అందించిన గులామ్ ముస్తఫా ఖాన్ బృందంలో హిందూస్థానీ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకోవడం జాహ్నవి పాటల ప్రస్థానం మొదలైంది. అలా తనకు నచ్చిన పాటలను పాడుతూ వాటిని ఇన్స్టా, యూట్యూబ్లో పోస్టు చేస్తూ సాధన చేయడం మొదలుపెట్టింది.
అమ్మపాడే జోలపాటతో నెట్టింట్లో సంచలనం : అలా ఓరోజు ఇన్స్టాలో జాహ్నవి పాడిన పాట, రచయిత మిట్టపల్లి సురేందర్ దృష్టికి వచ్చింది. జాహ్నవి గాత్రాన్ని చూసిన మిట్టపల్లి, అమ్మ పాటను పాడించాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన వ్యక్తుల ద్వారా జాహ్నవిని సంప్రదించి హైదరాబాద్కు ఆహ్వానించారు. నెల రోజులపాటు రకరకాల తెలుగు పాటలను పాడించి పరీక్షించాడు.
ఆ తర్వాత అమ్మ పాటను, అందులోని పదాల అర్థాలను ఆసాంతం వివరించి రఫ్ ట్యూన్తో పాడించారు. పాటపై, అందులోని పల్లవి, చరణాలపై జాహ్నవి పట్టు సాధించాక అసలు పాటను రికార్డు చేయించారు మిట్టపల్లి. వాస్తవానికి ఈ పాట 20 ఏళ్ల కిందట రాశారు మిట్టపల్లి. ఖమ్మం జిల్లాలో పనిచేస్తుండగా ఓ రోజు కిన్నెరసాని ఒడ్డున కూర్చొని తన తల్లితో మాట్లాడుతుండగా ఫోన్ సిగ్నల్స్ అందక వేదన పడ్డాడు. అప్పుడే ఈ పాట పుట్టింది.
YouTube Sensation Amma Pade Jola Song : వెండి వెన్నెల్లో నిండైన కిన్నెరసాని ప్రవాహం ఒడ్డున రాసిన ఆ నాటి అమ్మపాట, ఇప్పుడు పురుడు పోసుకొని ప్రపంచం మొత్తం అద్భుతః అనేలా దూసుకుపోతుంది. అయితే పాట విడుదల చేసే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఐపీఎల్ జోరు కొనసాగుతుంది. తమ పాట ఎవరు వింటారులే అనుకున్న జాహ్నవి, మిట్టపల్లిలకు ఊహించని అనుభవం ఎదురైంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్ లోకి రావడం ఆశ్చర్యపోయేలా చేసింది.