తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికా ఉపాధ్యక్షుడు మన తెలుగు అల్లుడే అని తెలుసా !

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా - రిపబ్లిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే - ఆయన భార్య ఉషా తెలుగు సంతతి మహిళ

US VICE PRESIDENT JD VANCE WIFE
America Vice President Wife Usha Indian Origin (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

America Vice President Wife Usha Indian Origin: అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన జేడీ వాన్స్ ఎవరో కాదండోయ్​ మన తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. ఉషా చిలుకూరి ఏపీలోని విశాఖ వాసులకు బంధువు. గత సంవత్సరం వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్​గా సేవలు అందించిన శాంతమ్మ మనుమరాలే ఈ ఉషా చిలుకూరి. బుధవారం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన సతీమణి ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మళ్లీ మార్మోగిపోతోంది.

ఉషాకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90 ఏళ్ల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉషా మనవరాలి వరుస అవుతారు. కొన్నేళ్ల కిందట ప్రొఫెసర్‌ శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి మృతి చెందారు. చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తే ఉషా. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌ను రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేయడంపై శాంతమ్మ ఆనందం వ్యక్తం చేసింది. ఉషా తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని ఆమె తెలిపారు. దీంతో ఉషా అంతగా పరిచయం లేదని చెప్పారు. జేడీ వాన్స్‌ తమ బంధువు అని తెలిశాక పలువురు ఫోన్​ చేసి అభినందనలు తెలిపారని శాంతమ్మ వివరించారు.

ఉషా పూర్వీకుల స్వగ్రామం కృష్ణా జిల్లాలో సాయిపురం :చెన్నైలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఉషా మేనత్త శారద జేడీ వాన్స్‌, ఉషా వివాహానికి సైతం హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. తమ బంధువులు ఎంతోమంది అమెరికాలో సిర్థపడ్డారని, అందులో ఉషా దంపతులు కూడా ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే ఎంతో గర్వంగా ఉందని శాంతమ్మ పేర్కొన్నారు. తమ ఆశీస్సులు ఉషాకు ఎప్పుడూ ఉంటాయి అంటూ తెలిపారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలం సాయిపురం. ఉషాకు తాత వరుసైన రామ్మోహనరావు కుటుంబం ఇక్కడే నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి వారి వంశవృక్ష పటం లభ్యమైంది. దశాబ్దాల కిందటే ఉషా పూర్వీకులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

18వ శతాబ్దంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉషా వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం కాగా రామశాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, వెంకటేశ్వర్లు, , గోపాలకృష్ణమూర్తి అందరూ ఉన్నత విద్యావంతులే. రామశాస్త్రి చెన్నైకు వలస వెళ్లి అక్కడే ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్​గా పనిచేశారు. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి కాగా అవధాని, నారాయణశాస్త్రి, రాధాకృష్ణ అనే ముగ్గురు కుమారులున్నారు. శారద ఒక్కగానొక్కు కుమార్తె ఉంది. రామశాస్త్రి ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా కుమార్తె శారద చెన్నైలోనే వైద్యురాలిగా స్థిరపడి నివాసం ఉంటున్నారు. రాధాకృష్ణ ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పామర్రుకు చెందిన లక్ష్మితో రాధాకృష్ణకు వివాహం కాగా వారి సంతానమే ఉషా.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details