Allu Aravind in Kims Hospital Secunderabad : సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. అనంతరం ఆయన బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శ్రీతేజ్ హెల్త్ స్టేటస్‌పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా ఫేమస్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గత 2 వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, అతడి ఆరోగ్యం కుదుటపడని విషయం విధితమే.
మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ డాక్టర్లు మంగళవారం (డిసెంబరు 17న) రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో వెంటిలేటర్‌పైనే ఉన్నాడని తెలిపారు. బాలుడి మెదడుకు ఆక్సిజన్ సరిగా అందటం లేదని వివరించారు. శ్రీతేజ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆసుపత్రి వైద్యుల బృందం తెలిపింది. ప్రస్తుతం బాలుడికి ఆహారాన్ని ట్యూబ్ ద్వారా అందిస్తున్నట్లు వెల్లడించారు.
అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు :ఈ సందర్భంగా అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌కు రాకపోవడానికి గల కారణాలను ఆయన తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఆస్పత్రిలో తొక్కిసలాట బాధిత బాలుడు శ్రీతేజ్‌ను తాను చూసినట్లు చెప్పారు. అతను క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారన్నారు. బాలుడు పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్ల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ కోలుకునేంత వరకు ఎంతైనా ఆర్థికంగా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శ్రీతేజ్ సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగి రావడానికి ప్రభుత్వం సహకరిస్తామనడం అభినందనీయ అంశమని అన్నారు.