తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్ కేటాయింపుల్లో భాగ్యనగరానికి దక్కిన సౌభాగ్యం - ఆగిపోయిన పనులకు కలగనున్న మోక్షం - Telangana 2024 budget

TG 2024 Budget Allocations for GHMC : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు సముచిత ప్రాధాన్యత దక్కింది. తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్ర పద్దుల్లో తొలిసారిగా జీహెచ్ఎంసీకి అత్యధికంగా 3 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న పై వంతెనలు, నాలాలు, అండర్ పాస్‌లు పూర్తి చేసేందుకు హెచ్ సిటీ ప్రాజెక్టుకు 2 వేలకుపైగా కోట్లను కేటాయించింది. నిధుల కేటాయింపుపై నగర మేయర్ విజయలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

TG 2024 Budget for GHMC Development
TG 2024 Budget Allocations for GHMC (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 9:31 PM IST

TG 2024 Budget for GHMC Development : నగరంలో అభివృద్ధి పనుల కోసం అప్పుల్లో కూరుకుపోయి వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తున్న జీహెచ్‌ఎంసీకి రాష్ట్ర బడ్జెట్‌లో ఊరట కలిగింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బల్దియా బాధలను కూడా అర్థం చేసుకుంది. బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి 3 వేల 65 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీకి అత్యధిక కేటాయింపులు జరగడం ఇదే తొలిసారి.

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్​ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024

మేయర్ హర్షం.. పద్దులో పేర్కొన్నట్లు బల్దియాకు నిధులు అందితే నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తికానున్నాయి. ప్రభుత్వ సూచనతో జీహెచ్ఎంసీలో ఇటీవల హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టును రూపొందించారు. దాని ద్వారా రహదారి అభివృద్ధి పనులు, నాలా నిర్మాణ పనులు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. దీని కోసం తాజా పద్దులో హెచ్ సిటీకి 2 వేల 654 కోట్ల రూపాయలను కేటాయించడంపై జీహెచ్ఎంసీ మేయర్ హర్షం వ్యక్తం చేసింది.

నిధుల లేమితో పనులలో జాప్యం.. ఇప్పటి వరకు ఆయా పనులపై జీహెచ్ఎంసీ ఏడాదికి గరిష్టంగా 800 కోట్లను మాత్రమే వెచ్చించగలిగేది. తాజాగా 3 వేల కోట్లు బడ్జెట్ కేటాయింపుపై మేయర్ విజయలక్ష్మి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాజా కేటాయింపుల వల్ల నిలిచిపోయిన పనుల్లో వేగం పెరగనుంది. జూపార్క్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు జరుగుతున్న పై వంతెన నిర్మాణం, నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు జరుగుతున్న స్టీల్ వంతెన నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు జరుగుతున్న వంతెన పనులు నిధులు లేక ఆగిపోయాయి.

పెద్దమొత్తంలో కేటాయింపులు.. అలాగే 400 కోట్ల విలువైన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వానికి 5 వేల కోట్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపింది. అధిక వడ్డీల వల్ల బల్దియాకు 7 వేల కోట్ల రూపాయల అప్పులు మోయలేని భారంగా మారాయని, అందుకుగాను వెయ్యి కోట్లు ఆర్థిక సాయం ప్రకటించాలని కోరింది. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, గ్రేటర్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపుల్లో 3 వేల 65 కోట్ల రూపాయలను కేటాయించింది.

మహానగరానికి తాగునీటిని అందించే జలమండలికి తాజా బడ్జెట్ లో ప్రభుత్వం నిధులు వరద పారించింది. గతానికి భిన్నంగా అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, జలమండలి ప్రతిపాదించిన 5 వేల 650 కోట్లకు గాను 3 వేల 385 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రత్యేకంగా 1450 కోట్ల రూపాయలను కేవలం అభివృద్ధి పనుల కోసం కేటాయింపులు చేసింది.

నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించడానికి చేపడుతున్న సుంకిశాల ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో వెయ్యి కోట్లు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న 30 ఎస్టీపీలు, ఔటర్ రింగు రోడ్డు వరకు తాగునీటిని సరఫరా చేసే ఫేజ్ -2 ప్రాజెక్టు, కలుషిత జలాల నివారణకు కొత్త పైపులైన్ల నిర్మాణం, పాతబస్తీలోని జోన్ 3 సివరేజ్ పనుల కోసం కేటాయింపులు చేశారు. వాటితోపాటు గ్రేటర్ లో ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్లు అందించే ఉచిత నీటి రాయితీ కోసం తాజా బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం.

రాష్ట్ర బడ్జెట్‌ 2024 - విద్యా, ఇంధన రంగాలకు కేటాయింపుల పూర్తి వివరాలివే - telangana state 2024 budget

సైబర్ టీమ్, టీజీన్యాబ్​ బలోపేతం దిశగా సర్కార్ బడ్జెట్ కేటాయింపులు - TG Budget for Home Department

ABOUT THE AUTHOR

...view details