- మీరు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎలా ఉంది?
జవాబు :మేం వచ్చేనాటికి వానాకాలం పంట ముగిసి యాసంగి మొదలైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. వానాకాలం పంటకు అప్పటి సర్కార్ నీరివ్వలేదు. కొనుగోలుకు సైతం కరెంట్ అందుబాటులో లేదు. కష్టమైనా సరే విద్యుత్ కొనుగోలు చేసి పంటలు కాపాడాం. భూగర్భజలాలు అడుగంటిన చోట ఇబ్బంది ఏర్పడింది. ఐనా గత యాసంగి కంటే ఈసారి ఎక్కువ పంటలు పండాయి. వర్షాకాలం పంటకు నీరివ్వకుండా బీఆర్ఎస్ నాయకులు మామీద నెపం మోపారు. భూగర్భ జలాలున్నాయని పంటలు పండుతాయనే ఆశతో అన్నదాతలు సాగు చేసినా ఈసారి అవి తగ్గిపోయి చివరి భూములకు నీరందలేదు.
- రైతుల కోసం భారీ హామీలిచ్చారు, వాటి అమలు తీరు ఎలా ఉంది?
జవాబు :అన్నదాతలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో హస్తం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చింది. వాటికి భారీగా నిధులు అవసరం. రూ.2 లక్షల రుణమాఫీకే రూ.40,000ల కోట్లకు పైగా కావాలి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దృష్ట్యా రుణం రాదు. తెలంగాణ ఆదాయం తగ్గింది. వీటిని అధిగమించి రుణమాఫీ చేయాలి. రైతుభరోసా, పంటల బీమా విధివిధానాలపై ఫోకస్ పెట్టాం. ధాన్యానికి బోనస్‌ను ప్రకటించాం.
- పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు కదా?
జవాబు :బీఆర్ఎస్ సర్కార్ రూ.లక్ష మాఫీయే సరిగా చేయలేదు. మేం రూ.2 లక్షల మాఫీ కచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం. ఒకే దఫా మొత్తం రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై ఫోకస్ పెట్టాం. దీంతోబాటు మార్గదర్శకాలు తయారుచేస్తున్నాం. తెలంగాణలో అన్నదాతలు తీసుకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగిశాక దీని కటాఫ్ తేదీపై కెబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దీన్ని సీఎం ప్రకటిస్తారు.
- రైతుబంధును ఐదెకరాలలోపు వారికి ఇస్తామన్నారు. అందరికీ వేశారు. రైతుభరోసా అందరికీ వర్తింపచేస్తారా?
జవాబు :సంక్షేమం నిరుపేదకు వెళ్లాలి. చేయూత అర్హులకు అందాలి. గత సర్కార్ హయాంలో రైతుబంధుకు ఆరేళ్లలో రూ.80,450 కోట్లు అందిస్తే, అందులో పంటలు వేయని వారికి రూ.25,000ల కోట్లు ఇచ్చారు. రైతుభరోసా ఐదెకరాల్లోపు వారికి సాయం అందించాలనే సూచనలు వస్తున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న పథకం కాబట్టి దానిని యథాతథంగా అమలు చేద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుభరోసాలో మార్పులు చేయాలనుకుంటున్నాం. ఎన్ని ఎకరాల వారికి వర్తింపచేయాలనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. పరిమితి విధిస్తే భారీగా భూములున్న వారికి సాయం రాదు. నాకు కూడా సాయం అందదు. నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను.
- పంటల బీమా అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయా?
జవాబు :అకాల వానలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్లు, కరవు వల్ల పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేలా ఈ పథకం ఉంటుంది. పంట దిగుబడులు తగ్గినా, పంట వేయలేని పరిస్థితులున్నా సాయం అందాలి. ఈ పథకానికి రూ.3500 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాం. దీనిపై టెండర్ డాక్యుమెంట్ తయారవుతోంది. బీమా కంపెనీల కోసం కాకుండా అన్నదాతలకు మేలు జరిగేలా విధివిధానాలు ఉంటాయి. గతంలో అప్పు తీసుకున్న వారికే సాయం అందేది. ఇది బీమా కంపెనీలకు లాభం తెచ్చింది. కొత్త పథకం అలా ఉండదు. దీనిపై మేం పెట్టిన షరతులకు అంగీకరించే కంపెనీలనే ఎంపిక చేస్తాం.
- వరికి బోనస్ ఇస్తామన్నారు, కానీ సన్న రకాలకే ప్రకటించి, దొడ్డు వడ్లకు ఎందుకు మినహాయించారు?
జవాబు :తెలంగాణలో భవిష్యత్‌లో సన్నరకం బియ్యం ఉత్పత్తి చేసి, రేషన్‌షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. దీనికోసం వాటి ఉత్పత్తిని పెంచాలి. ఇందుకు పెట్టుబడి ఎక్కువవుతుంది. దిగుబడి తక్కువ వస్తుంది. దీంతో అన్నదాతలు సాగుకు వెనుకాడుతున్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందని దొడ్డు వడ్లనే వేస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రాథమికంగా సన్నవడ్లకు బోనస్ ప్రకటించాం. అవసరాన్నిబట్టి దొడ్లు వడ్లకూ వర్తింపజేస్తాం.
- వానాకాలం సీజన్ సన్నద్ధత ఎలా ఉంది