Minister Thummala On Availability Of Seeds :రాష్ట్రంలో వానాకాలంలో రైతుల సౌకర్యార్థం విత్తన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కేవలం అదిలాబాద్ జిల్లాలో మాత్రమే రైతులు ఎక్కువ మంది ఒక కంపెనీ విత్తనాల కోసం ఒకటి, రెండు రోజులు వచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో మంత్రి ఛాంబర్లో ఆయనను రైతు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి అమలు చేసే పథకాలైన రైతుభరోసా, రుణమాఫీ, పంటల బీమాపై వివిధ రైతు సంఘాలతో జిల్లాల వారీగా చర్చించిన విషయాలను అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, గౌరవ చిన్నారెడ్డి తెలియజేశారు.
కౌలు రైతుల సమస్యలపై : ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుభరోసా, రుణమాఫీ అమలు చేస్తుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారం రైతుల శ్రేయస్సుకు అవసరమైన పథకాలను మంత్రివర్గంలో చర్చించి ముందుకు తీసుకువస్తామని తెలియజేసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాల నేతలు తీగల సాగర్, కన్నెగంటి రవి, పశ్య పద్మ, విస్సా కిరణ్, పాకాల శ్రీహరి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భూ యాజమాన్య హక్కుల చట్టాలు సవరించాల్సిన ఆవశ్యకత వివరించారు.