Telangana Agriculture Department AEOs Suspension :రాష్ట్రంలోని 162 మంది వ్యవసాయ విస్తరణాధికారులను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు మరణించిన వెంటనే బీమా పథకం కోసం వివరాలు ఎంటర్ చేయలేదనే కారణంతో వారిపై చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించింది. జిల్లాల వారీగా ఏఈవోల సస్పెన్షన్లపై కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 80 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు.
అయితే పంటల డిజిటల్ సర్వేలో పాల్గొనేందుకు నిరాకరిస్తూ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేదనే కారణంగానే తమను సస్పెండ్ చేశారని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. ఒక ఉన్నతాధికారి కుమారుడి సంస్థకు చెందిన యాప్‌లో వివరాలను నమోదు చేయించేందుకు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తమపై సర్వేల భారం మోపుతున్నారని దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దఎత్తున ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైదరాబాద్‌కు తరలివచ్చి ధర్నా :సస్పెండైన వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)లు హైదరాబాద్‌లోని వ్యవసాయ డైరెక్టరేట్‌కి తరలివచ్చారు. డైరెక్టర్ గోపి ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన వారిని కలవకుండానే వెళ్లిపోయారు. దీంతోే డైరెక్టరేట్ ఎదుట ఏఈవోలు ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సంజాయిషీ తీసుకోకుండానే చర్యలు తీసుకోవడం దారుణమని వాపోయారు. ఒక ఉన్నతాధికారి ప్రయోజనం కోసం తమను తీవ్రంగా ఇబ్బందులపాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వెంటనే సస్పెన్షన్‌లు ఎత్తివేయాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. వారికి ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య నేత జీవన్ తదితరులు మద్దతును తెలిపారు. రాత్రి వరకు ధర్నాను నిర్వహించింది.