Rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. తుపాను తీరం దాటాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు జాగ్రత్తలు సూచించారు.
గురువారం ఉదయం చెన్నై-నెల్లూరు మధ్య తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. అనంతరం మరింత బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ వెల్లడించారు. పోర్టుల్లో ప్రకటించిన ప్రమాద హెచ్చరికల్ని ఉపసంహరించినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొచ్చని చెప్పారు.
భారీ వర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు పరిస్థితిని వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం రాత్రి నుంచి భారీగా రాకాసి అలలు ఎగసిపడ్డాయి.
విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, జగ్గరాజుపేట, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో గృహాలు కోతకు గురయ్యాయి. పలు ఇళ్లు ఓ వైపునకు ఒరిగిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అద్దె ఇళ్లలోకి, ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలివెళ్లారు. కోతకు గురైన ప్రాంతాల్లో కాకినాడ ఆర్డీవో మళ్లిబాబు పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల వివరాలు నమోదు చేసుకున్నారు. తెలుగుదేశం పిఠాపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వర్మ బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అర కిలోమీటరు మేర సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. అంతర్వేదిలో సముద్రం నీరు పోటెత్తింది. పల్లిపాలెంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. మలికిపురం మండలం కేశవదాసుపాలెం, చింతలమమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో నీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. ఓఎన్జీసీ టెర్మినల్‌ను సముద్రం నీరు ముంచేసింది. టెర్మినెల్ గోడ వెనకవైపు తీవ్ర కోతకు గురైంది.