Adulterated Milk Issues in Telangana : డాక్టర్లు రోజూ గ్లాసెడు పాలు తాగమని చెప్పినా ప్రస్తుతం కొందరు భయపడుతున్నారు. ఏదైనా వేడుకలో వడ్డించే గడ్డ పెరుగును చూసి తినాలా? వద్దా? అని మరికొందరు సంశయిస్తున్నారు. పైసలెక్కువైనా సరే మంచి పాలతో చాయ్ పెట్టమని టీ కొట్టు వద్ద మరి కొందరు అడుగుతున్నారు. ఎందుకీ పరిస్థితి కారణం కల్తీ కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారుల పా‘పాలు’ అమాయకులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ద్రవ పదార్థాల అన్నింటిలోకెల్లా దివ్యౌషధంగా పరిగణించే పాల విషయంలో ఊహించని నిజాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాలను కల్తీ చేసేవారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆదేశించినా, అప్పుడప్పుడూ కొందరు కృత్రిమంగా పాలను తయారు చేస్తూ పట్టుబడి శిక్షను నుభవిస్తున్నా, ఈ కల్తీలకు పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు.
మనకు తెలియకుండానే రకరకాల కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తూ లేనిపోని వ్యాధులకు కారణమవుతున్నాయి. అయినా ఈ పాల కల్తీ తీరుపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. మంగళవారం (నవంబర్ 26) జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం మీకోసం.
ఉత్పత్తి తక్కువ, విక్రయాలు ఎక్కువ :ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 180 మిల్లీ లీటర్ల పాలు అవసరం. ఈ లెక్కన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని 33 లక్షల జనాభాకు దాదాపుగా 5 లక్షల లీటర్లకు పైగా అవసరం. వ్యాపారాలు, శుభకార్యాలకు లెక్కేసినా దాదాపు 6 లక్షల 50 వేల లీటర్ల పాల డిమాండ్ ఉంటుంది. కానీ జిల్లాలో ఉన్న సుమారు 8 లక్షల పాడి గేదెల ద్వారా 2 లక్షల 80 వేల నుంచి 3 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్యాకేజ్డ్ పాల ద్వారా కొంత అవసరాలు తీరుతుండగా, మిగతా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై తీవ్ర అనుమానాలున్నాయి.
అక్రమం, ఇందుకోసమే! :ప్రతి ఇంట్లో పాల కోసం లీటరుకు రూ.70 నుంచి 100 వరకు వెచ్చించడానికి జనాలు వెనుకాడటం లేదు. ఈ అవసరమే ఆసరాగా కొందరు పాల కల్తీకి పాల్పడుతున్నారు. కొవ్వులేని పాలల్లో ల్యాక్టోజ్, ప్రొటీన్, మినరల్స్ అనే పదార్థాలుంటాయి. వీటిని పెంచడానికి కల్తీ చేస్తారు. చిక్కదనంతో పాటు రంగు, ఎక్కువ కాలం నిల్వ కోసం వివిధ రకాల కెమికల్స్‌ని వాడుతున్నారు. రోజులో 10 లీటర్ల కల్తీ పాలు అమ్మినా, వెయ్యి రూపాయల వరకు ఆదాయం ఆర్జించవచ్చనే ఉద్దేశంతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.