తైక్వాండోలో రాణిస్తున్న ఆటో డ్రైవర్ కుమార్తె (ETV Bharat) Auto Driver Daughter Excels in Martial Arts from Adilabad : ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవడంపై నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఆత్మరక్షణతో పాటు అంతర్జాతీయ పతకాలు సాధిస్తానంటోంది ఈ అమ్మాయి. ఖేలో ఇండియా పోటీల్లో 75 కిలోల బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు కసరత్తులు చేస్తోంది.
అదిలాబాద్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పాండురంగ్, అరుణల కుమార్తె వనిత రాథోడ్. తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ అమ్మాయికి చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై మక్కువ ఎక్కువ. అమ్మాయి ఆసక్తి గుర్తించిన తల్లిదండ్రులు పదో తరగతి పూర్తి కాగానే మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇప్పించారు.
మార్షల్ ఆర్ట్స్‌పై మక్కువతో అందులోని నైపుణ్యాలను త్వరగానే అవపోసన పట్టింది ఈ అమ్మాయి. ఇటీవల రాంచీలో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో 75 కిలోల బాక్సింగ్ విభాగంలో పసిడి పతకంతో మెరిసింది. దాంతో పాటు హరియాణాలో నిర్వహించిన విశ్వవిద్యాలయాల బాక్సింగ్, కుస్తీ పోటీల్లో స్వర్ణం సాధించింది. ఖేలో ఇండియా సౌత్‌జోన్ వూషూ పోటీల్లో 72కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నట్లు ఈ యువతి చెబుతోంది.
"ఇటీవలే గద్వాల్‌లో బ్లాక్ బెల్ట్ టెస్ట్‌లో పాల్గొన్నాను. నేషనల్ స్థాయిలో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. నేషనల్ రిఫరీగా కూడా పాల్గొనడం జరిగింది. జగిత్యాలలో తైక్వాండో స్టేట్ ఫెడరేషన్‌లో రిఫరీగా చేయడం జరిగింది. కేరళలో జరిగిన ఖేలో ఇండియా కాంఫిటేషన్‌లో నాకు కాంస్యం పతకం వచ్చింది. తమిళనాడులో జరిగిన ఖేలో ఇండియాలో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఝార్ఖండ్‌లో నేషనల్, ఫెడరేషన్ కప్‌లో తెలంగాణను మూడో ప్లేస్ రావడంతో పాటు కాంస్యం పతకం వచ్చింది. ఇలా కాలేజీ యూనివర్సిటీ బాక్సింగ్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. నేను ఈవినింగ్ ఒక గంటపాటు మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన కరాటే నేర్పిస్తాను." - వనిత రాథోడ్, క్రీడాకారిణి
పాఠశాల విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ : మార్షల్ ఆర్ట్స్‌తో పాటు చదువుల్లోనూ ఈ యువతి ప్రతిభ చూపిస్తోంది. పాలిటెక్నిక్‌లో డిప్లొమా అలాగే డీ.పీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే తాజాగా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ డాన్ 1 స్థాయికి చేరుకున్నట్లు వివరిస్తోంది. జోగులాంబ గద్వాలలో ఈనెల 19 నుంచి 21వరకు జరిగిన జాతీయస్థాయి తైక్వాండో టోర్నమెంట్‌లో రెఫరీగా వ్యవహరించానని వనిత చెబుతోంది. మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన కరాటే, తైక్వాండో, వూషూ, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొంది పతకాలు సాధిస్తోంది వనిత. ఆత్మరక్షణలో ప్రధాన ఆయుధం ఐన మార్షల్ ఆర్ట్స్‌ని అమ్మాయిలు తప్పని సరిగా నేర్చుకోవాలని అంటోంది. అందుకు తగ్గట్లుగా తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రోత్సహించాలని సూచిస్తోంది. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నానని చెబుతోంది.
ఆడపిల్లను ఒంటరిగా బయటకు పంపించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న రోజులివి. అటువంటి పరిస్థితి తమకు రాదని వనిత తల్లిదండ్రులు అంటున్నారు. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వనిత జాతీయస్థాయిలో పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు కాదు మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన కరాటే, వూషూ, తైక్వాండో, బాక్సింగ్ వంటి క్రీడల్లో పతకాలు సాధిస్తోంది ఈ క్రీడాకారిణి. భవిష్యత్తులో ఒలిపింక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావడమే లక్ష్యమని అంటోంది.
"పదో తరగతి అయిపోయిన తర్వాత వెళ్లి తైక్వాండో నేర్చుకుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటల క్లాసులకు వెళ్లేది. ఇప్పుడు విద్యార్థులకు నేర్పిస్తోంది. దేశానికి మంచి పేరు తీసుకురావాలనేది నా కోరిక. ఇప్పుడు తను ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిన తమకు భయం అనేది లేదు. ఎందుకంటే తను మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంది." - పాండురంగ రాథోడ్, వనిత తండ్రి