Keerthy Suresh Marriage Update :టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ వివాహ ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి సంబంధించిన వివరాలను శుక్రవారం స్వయంగా ఆమె వెల్లడించారు. కీర్తి సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలేశుని దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కీర్తి సురేశ్, తన పెళ్లి వేడుక వచ్చే నెలలో గోవాలో జరగనుందని చెప్పారు.
కీర్తి సురేశ్ పెళ్లిపై సోషల్ మీడియాలో వార్తలు :కీర్తి సురేశ్ పెళ్లి గురించి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీతో డిసెంబర్ 11న గోవాలో పెళ్లి చేసుకోనున్నట్లుగా రూమర్లు వచ్చాయి. అయితే ఈ విషయమై గతంలో కీర్తి సురేశ్ తండ్రి ఈటీవీ భారత్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కీర్తి సురేశ్ వివాహం గురించి అధికారికంగా ప్రకటిస్తామని, ఆయన కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఎట్టకేలకు తన వివాహం గురించి కీర్తి సురేశ్ క్లారిటీ ఇవ్వడంతో తాము చెప్పింది నిజమేనంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను శైలజా చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన కీర్తి సురేశ్ తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మహానటి సినిమాతో ఆమె దేశవ్యాప్తంగా ఆమె పాపులర్ అయింది.