ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేరాలు చేయటం-విదేశాలకు చెక్కేయటం - ఇలాంటి వారిని తీసుకురాలేమా! - accused persons go to abroad - ACCUSED PERSONS GO TO ABROAD

Accused Commit Crimes in India Go to Fogeign Countries : దేశంలో నేరాలు చేయటం, విదేశాలకు చెక్కేయటం కొంతమంది నేరస్థులకు పరిపాటిగా మారిపోయింది. నన్నేం చేయలేరని ధైర్యంతో విదేశాల్లో మకాం పెట్టేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరిని కట్టడి చేసేందుకు 1962లో ఎక్స్​ట్రాడిషన్​ యాక్ట్​ను కేంద్రం అమల్లోకి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

accused_foreign
accused_foreign (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 10:10 AM IST

Updated : Aug 3, 2024, 11:24 AM IST

Accused Commit Crimes in India Go to Fogeign Countries :ఒకరు హత్యాయత్నం కేసులో నిందితుడు ఐనా దర్జాగా విదేశాలకు పారిపోయాడు. మరొకరు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థను దూషించారు. మీరు నన్నేం చేయలేరు అంటూ విదేశాల నుంచి వీడియోతో సీబీఐకి సవాల్‌ చేశాడు. ఇంతేనా సీఎం పైనే హత్యాయత్నం చేసి దర్జాగా మారిషస్‌కు పరారయ్యాడు మరోవ్యక్తి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కీలక కేసుల్లో నిందితులు విదేశాలకు వెళ్లడం, తిరిగి రాకండా అక్కడే తలదాచుకోవడం అలవాటుగా మారిపోయింది.

ఇలాంటి వారిని తీసుకొచ్చేందుకు భారత్‌ కొన్ని దేశాలతో న్యాయ, దౌత్య సంబంధాలు కలిగి ఉన్నా అమలులో మాత్రం ఎలాంటి పురోగతి ఉండటం లేదు. విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండడంతో కేసులు అటకెక్కుతున్నాయి. మరి పరిస్థితి మారేదెట్లా ఇలాంటి నిందితులను భారత్‌ తీసుకురాలేమా? పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ ఏం చెబుతోంది?

ఐదేళ్ల సమస్యలపై వినతుల వెల్లువ - టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన బాధితులు - YSRCP Victims at TDP Central Office

మన దేశంలో చాలా మందికి చట్టం చుట్టంలా పని చేస్తుంది అంటారు. కొన్ని కేసులు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా నేరాలు చేయటం విదేశాలకు చెక్కేయటం అక్కడ దర్జాగా గడపడం ఇది భారత్‌ నుంచి వెళ్తున్న కొందరు నిందితుల పని. విదేశాల్లో ఉండి నన్నేం చేయలేరని సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలకే సవాల్ విసురుతున్నారంటే నిందితులు చట్టాలను వారికి అనుకూలంగా ఎలా మలుచుకున్నారో అర్థం అవుతుంది.

2003లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులో కొల్లం గంగిరెడ్డి కీలక నిందితుడు. ఆ ఘటన జరిగిన తర్వాత గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. 2015లో అప్పటి సీఎం చంద్రబాబు గంగిరెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రెడ్ కార్నర్ నోటీసు ఇప్పించి చివరకు మారిషస్‌లో అరెస్ట్ చేసి భారత్‌కు తరలించారు. కానీ ఇందుకు సుమారు పదేళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో పారిపోయిన వాళ్లతో పాటు, దేశం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నిందితులపై కూడా పోలీసులు నిఘా ఉంచుతున్నారు.

గుంటూరు డీసీసీ బ్యాంకులో అక్రమాలు - నకిలీ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతల రుణాలు - Big Scam In Guntur GDCC Bank

ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన బెంగళూరు మీదుగా దుబాయ్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే కూడా ఇలానే పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. వంశీ అనుచరులను కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ఆయన కోసం పోలీసులు వేట కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థను దూషించిన కేసులో నిందితుడు పంచ్ ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయాలని పలుసార్లు సీబీఐని కోర్టు ఆదేశించింది. ఐతే ఇంటర్‌పోల్‌తో కలిసి అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న సీబీఐ అధికారులు ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. మీరు నన్నేం చేయలేరు అని పంచ్‌ ప్రభాకర్‌ దర్జాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. గతంలో మాఫియా డాన్ అబు సలేం నకిలీ పాస్ పోర్ట్ కేసులో పోర్చుగల్‌లో దొరికాడు. అయితే, పోర్చుగల్‌ భారత్‌కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో అబుసలేం, మోనికాబేడీని భారత్‌కు తరలించారు.

విస్తుపోయేలా వైఎస్సార్సీపీ నేతల భూదోపిడీ - అయిదేళ్లుగా ఏం జరిగింది? - PRATHIDWANI ON YSRCP LAND GRABS

తెలంగాణలో ఇటీవల కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ఎస్​బీఐ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, A6 గా ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావులు విదేశాల్లో ఉన్నారు. ప్రభాకర్ రావు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్లానని పోలీసులకు తెలపగా శ్రవణ్ రావు తన సోదరి కోసం అమెరికాలో ఉండాల్సి వచ్చిందని త్వరలో వస్తానని పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో నలుగురు నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌ రావులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావు అదేశాలతోనే ట్యాపింగ్ చేశామని వారు తెలిపారు. ఐతే ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావులు వస్తే తప్ప కేసులో పురోగతి కనిపించేలా లేదు.

గతేడాది పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ దుబాయ్‌కి పారిపోయాడు. ఆ తర్వాత తిరిగి రావడంతో ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న గొర్రెల కొనుగోళ్ల కుంభకోణం కేసును అనిశా దర్యాప్తు చేస్తోంది. అయితే కేసులో ప్రధాన నిందితులైన సయ్యద్ మొహిదుద్దీన్, అతని కుమారుడు సయ్యద్ ఇక్రముద్దీన్‌లపై గచ్చిబౌలిలో కేసు నమోదైందని తెలియగానే సౌదీ అరేబియా పారిపోయారు. కేసు నమోదై 6 నెలలు గడిచినా ఇప్పటి వరకూ వీరి జాడలేదు. ఏడాది కాలంగా ఇలాంటి ఘటనలు పెరిగాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో భూకబ్జాలు - నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధికారులు, బాధితులు - Land Grab on YCP Government

భారత్‌లో నేరం చేసి విదేశాల్లో తల దాచుకుంటున్న నిందితులను తిరిగి తీసుకురావడానికి 1962లో కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం భారత్‌ 48 దేశాలతో నేరస్తుల అప్పగింతపై అంగీకారం చేసుకోగా 12 దేశాలతో ఒప్పందం చేసుకుంది. నేరం చేసిన నిందితులు విదేశాలకు పారిపోతే వారిని తిరిగి తీసుకురావడానికి ఈ ఒప్పందం ఉపయోగిస్తున్నారు. నిందితుల అప్పగింతపై సభ్య దేశాలకు ఇంటర్‌పోల్ సహకరిస్తుంది. ఇంటర్ పోల్‌లో 192 సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్‌లో ఇంటర్‌పోల్‌కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. విదేశాల్లో ఉన్న నిందితులపై అరెస్ట్ వారెంట్‌లు ఉన్నప్పుడు ఇంటర్​ పోల్​ రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులను ఇస్తుంది. ఇవి జారీ అయ్యాక నిందితుడు ఏ ఎయిర్‌పోర్టుకు వచ్చినా అతనిపై ఉన్న కేసుల గురించి తెలిసిపోతుంది. తద్వారా మన దేశానికి ఆ దేశం అంగీకారంతో అప్పగించడం లేదా విచారించడమో చేసే అవకాశం దక్కుతుంది.

నేరస్థులు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకునేందుకు భారత్‌కు సరిహద్దుల్లో ఉన్న దేశాలకు జల, రోడ్డు మార్గాల్లో వెళ్లి అక్కడ నుంచి విదేశాలకు పారిపోతున్నారు. అందుకోసం ముందుగానే ఆ దేశ వీసాలకు దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉంటున్నారు. లేదా న్యాయసలహా తీసుకుని కేసు ప్రారంభమవ్వగానే కోర్టు నుంచి నోటీసులు వచ్చే లోపు విదేశాల్లో వాలుతున్నారు. ఆ విధంగా పారిపోయి విదేశాల్లో తలదాచుకున్న నిందితులను పట్టుకునేందుకు స్థానిక మెజిస్ట్రేట్ ముందు పిటిషన్ దాఖలు చేయాలి. కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఫలానా దేశంలో ఉన్నాడని, అతన్ని విచారణ చేయాలని కోర్టు అనుమతి తీసుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆ తర్వాత సీబీఐ సాయంతో ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. ఇలా చట్టంలో ఉన్న లొసుగులను అవకాశంగా తీసుకుని నిందితులు తప్పించుకుం టున్నారు.

ఇటీవల ప్రకటించిన పాస్‌పోర్టు ఇండెక్స్‌ ప్రకారం మన దేశం నుంచి అరైవల్‌ వీసాతో 58 దేశాలకు ప్రయాణించవచ్చు. దీంతో కేసు నమోదవ్వగానే చట్టాల్లోని లొసుగులను వాడుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఒకవేళ లుక్‌ ఔట్‌ సర్క్యూలర్‌ జారీ అయినా వారిని అరెస్టు చేయాలంటే భారత్‌ తిరిగొచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీంతో విచారణ ఆలస్యమవుతుంది. ముఖ్యంగా యూరప్‌లోని కొన్ని దేశాలతో ఒప్పందాలు ఉన్నప్పటికీ నిందితుల్ని అప్పగించేందుకు ఆయా దేశాలు అంగీకరించడం లేదు. ఇందుకు ఉదాహరణకు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా కేసులేనని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి నిందితులు భారత్‌ పౌరసత్వం కూడా వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.

తప్పుడు పత్రాలతో మా భూములు లాక్కున్నారు -​ ప్రజాదర్బార్​లో వల్లభనేని వంశీ బాధితులు - Complaints on Vallabhaneni Vamsi

భారత పాస్‌పోర్టు కలిగిన ఎవరైనా నిందితుడు విదేశాలకు వెళ్ళి తిరిగి రాకపోతే దాన్ని రద్దు చేయించే అవకాశం ఉంది. ఇలా చేస్తే సదరు నిందితుడు అక్రమంగా విదేశాల్లో ఉంటున్నట్లే. పాస్‌పోర్టు రద్దయిన విషయాన్ని మన దర్యాప్తు సంస్థలు ఆ దేశానికి చెబుతాయి. దాంతో తమ దేశంలో ఉంటున్న నిందితుడ్ని బలవంతంగా వెనక్కి పంపే అవకాశం కూడా ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లర్ ఎర్ర గంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు. కానీ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావు విషయంలో ఇది సాధ్యపడడం లేదు. తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని, పారిపోలేదని, దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు.

నేరం ఏదైనా సరే దేశం దాటి పారిపోయిన నేరగాడిని పట్టుకునేందుకు మన వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకునేటప్పుడు వారికి పూర్తి స్థాయి ఆధారాలు సమర్పించాలి. కానీ, కోర్టులు, విచారణల్లో జాప్యం కారణంగా ఏళ్లకు ఏళ్లు అవి మూలకు పడుతున్నాయి. దీంతో కేసులు కాదు కదా కనీసం విచారణ కూడా ముందుకు సాగని పరిస్థితి. తద్వారా నిందితులు విదేశాలను పునరావాసాలుగా మార్చుకుంటూ గడుపుతున్నారు. ఇదే తంతు కొనసాగితే వీరిని చూసి మరికొంత మంది తయారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Last Updated : Aug 3, 2024, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details