Accident in Ibrahimpatnam NTTPS :ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేస్తున్న సమయంలో బూడిద నిల్వ తలుపులు తెరుచుకున్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. వేడి బూడిద తాకిడికి ఒక ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అధికారులు తరలించారు.
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది :ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. బాయిలర్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం జరగటం దురదృష్టకరమని అన్నారు. ఆస్పత్రి సిబ్బందితో ఫోన్లో మాట్లాడిన మంత్రి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.