The Unstoppable Death Toll of Olive Ridley Turtles : రాష్ట్రానికి దాదాపు వెయ్యి కిలోమీటర్ల అతి పొడవైన సముద్ర తీరం ఉంది. ఇది రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించనుండగా అదే సమయంలో మరికొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలు, పెరుగుతున్న సముద్ర జలాల కాలుష్యం అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. సముద్రంలో దాదాపు 150 మీటర్ల లోతులో జీవించే ఈ రకం తాబేళ్లు సంతానోత్పత్తి సమయంలో ప్రాణాలు ఫణంగా పెడుతున్నాయి. తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న క్రమంలో చేపల వలలకు చిక్కి, బోటు పంఖాలు తగిలి కొన్ని మృత్యువాత పడుతుండగా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కాకినాడ బీచ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్దఎత్తున మృతి చెందుతున్న విషయం తెలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతికి వాస్తవ కారణాలు దర్యాప్తు చేయాలని, తాబేళ్ల సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్‌ని పవన్ ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణపై అటవీ, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు దృష్టి సారించింది. మూడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పలు సంరక్షణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. సముద్ర జలాల్లో చేపల వేట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోటు ఆపరేటర్లు, మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు.
తీర ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం
వాకలపూడి పారిశ్రామిక వాడలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్య ఉద్ఘారాలు వెలువడుతూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువుల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ శ్రీ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శ్రీ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. పరిశ్రమ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
కాకినాడలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి - విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం
అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు విశాఖ, కాకినాడ, మచిలీపట్నం తీరంలో గుడ్లు పెట్టేందుకు వస్తూ చేపల వలలకు చిక్కుతున్నాయి. బోట్ల మోటార్ ఫ్యాన్లు తగిలి మరికొన్ని మృత్యువాత పడుతున్నాయి. పరిస్థితి తీవ్రత గమనించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతికి కారణాలు తెలుసుకుని, పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించారు. ఆందోళన కలిగిస్తున్న పరిణామాలపై అధికారులు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
విశాఖ తీరంలోనూ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. రిషికొండ బీచ్ మొదలుకుని ఆర్‌కే బీచ్, భీమిలి వరకూ పలు ప్రాంతాల్లో నిత్యం కనిపిస్తున్న తాబేళ్ల కళేబరాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలివ్ రిడ్లీ అంటే..!
ఉపరితల కవచం (షెల్) ఆలివ్‌గ్రీన్ రంగులో ఉండడం వల్ల సముద్ర తాబేళ్లకు ఆ పేరు వచ్చింది. రెండున్నర అడుగుల పొడవు, 35 నుంచి 45 కిలోల బరువు ఉండే తాబేళ్లు సుమారు 150 మీటర్ల లోతులో సంచరిస్తూ శ్వాస కోసం ప్రతి 30నిమిషాలకోసారి ఉపరితలంపైకి వస్తాయి. సముద్ర జలాల్లో లభించే ఆల్గేరకపు నాచు, క్రస్టేషియన్స్, నత్తలు, జెల్లీ ఫిష్, ఇతర చిన్న చేపల్ని ఆహారంగా తీసుకుంటాయి. నవంబరు నుంచి జనవరి వరకు ఇవి గుడ్లు పెట్టే సమయం. తూర్పు తీరంలో గుడ్లు పెట్టడానికి గుంపులుగా ఇసుక తిన్నెలపైకి చేరుతుంటాయి.
ఒక్కో తాబేలు 100 నుంచి 110 వరకు గుడ్లు పెట్టి 50 నుంచి 60 రోజుల వ్యవధిలో పొదుగుతాయి. ప్రస్తుతం తాబేళ్ల పునరుత్పత్తి సమయం నేపథ్యంలో వాటిని కాపాడే చర్యలపై దృష్టి సారించామని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు వెల్లడించారు.
తీరంలో గుడ్లు పెట్టేందుకు కొన్ని వందల మైళ్ల దూరం సముద్ర జలాల్లో ప్రయాణించే సమయంలో తాబేళ్లు వలలకు చిక్కుకొని మరణిస్తుంటాయి. ఇదిలా ఉంటే తీరంలో పెట్టిన గుడ్లను కుక్కులు, ఇతర జంతువులు తినేయడంతో వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.