ACB Additional SP on Jogi Rajeev Arrest: అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్‌ను అరెస్టు చేశామని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్మెంట్లో ఉన్నాయని, ఆ భూముల సర్వే నెంబర్‌ను మార్చారన్నారు. సీఐడీ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నట్లు వెల్లడించారు.
పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని, ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని చెప్పారు. అందుకే తమ విచారణ వేరుగా సాగిస్తున్నట్లు తెలిపారు. సీఐడీ, ఎసీబీ అధికారుల విచారణ నివేదికలు ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు. తమ దర్యాప్తులో ఐదుగురు పేర్లు ఉన్నాయని, విచారణలో మరికొన్ని పేర్లు రావొచ్చన్నారు. జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతుందని, ఆయన ప్రమేయంపై నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
87 సర్వే నెంబర్లో ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదన్నారు. అవ్వా శేష నారాయణ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలాకే కేసు నమోదు చేశామని చెప్పారు. సర్వే నెంబర్ 88లో స్థలం కొని 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారని, ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగిందని వెల్లడించారు. గ్రామ, మండల సర్వేయర్లను మేనేజ్ చేశారన్నారు. సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్‌లను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.