Aasara Pensions in Telangana 2024 : తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీని ఈ నెల నుంచైనా అమలు చేస్తారనే భావనతో పింఛన్‌దారులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నెల కూడా వారి ఆశలు ఆడియాశలు అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆసరా పింఛన్లను (Aasara Pensions) ఈ నెలలో పాత పంథాలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పాత తరహాలోనే పింఛన్లు :ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో అధికారులు నగదు జమ చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 వస్తోంది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించింది. కానీ ఆ హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేకపోవడంతో పాత తరహాలోనే పింఛన్లను విడుదల చేయనున్నారు.
దరఖాస్తు సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా - అయితే మీకు పింఛన్ రాదు!
OldAasara Pensions Telangana :తెలంగాణలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 5,03,613 మంది దివ్యాంగులు, 15,60,707 మంది వితంతువులు, బీడీ కార్మికులు 4,24,585 మంది, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998, ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు అందుకుంటున్నారు. వీరికోసం ప్రతినెలా రూ.1000 కోట్లు ఖర్చవుతోంది. కొత్త పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల అర్జీలు వచ్చాయి. ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, కొత్తవాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉంది.