Young Man Excelling in Movies :అతడికి బాల్యం నుంచి సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా చిత్రసీమలో(సినీ రంగంలో) పనిచేయాలనేది కల. షార్ట్ ఫిల్మ్‌లతో తన ప్రయాణం మొదలుపెట్టారు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నారు. తన పేరు వెండితెరపై కనిపించాలని అతడు అనుక్షణం పరిశ్రమించారు. శుక్రవారం విడుదలవుతున్న నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘తండేల్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
కురవికి చెందిన వ్యాపారి కొదుమూరి వెంకటేశ్వర్లు, నాగమణి దంపతుల చిన్న కుమారుడే శ్రీనాథ్. మానుకోటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, బీటెక్ విద్యనభ్యసించారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే తిరుమలాపురం అనే గ్రామానికి చెందిన భరత్‌కుమార్‌తో కలిసి ఓ లఘుచిత్రం తీసి తన ప్రతిభ చాటుకున్నారు. లక్ష్యం నెరవేరిన అనంతరమే తాను పడిన కష్టం విలువ తెలుస్తుందని కురవికి వచ్చిన ప్రతిసారి అంటుండేవాడని శ్రీనాథ్ స్నేహితులు గుర్తుచేసుకున్నారు.
2021లో చిత్రసీమలోకి :కఠోర శ్రమతో సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకున్న శ్రీనాథ్ కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన డెవిల్ చిత్రానికి చీఫ్ అసోసియేట్‌గా వ్యవహరించారు. 2023 నవంబరులో నాగచైతన్య, సాయి పల్లవి తండేల్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చిత్రంలో 5 మంది అసోసియేట్ డైరెక్టర్లు ఉండగా అందులో శ్రీనాథ్ ఒకరు. శుక్రవారం ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.