Tiger Roaming in Warangal District : పులి అంటే చాలు ప్రజల్లో వణుకు పుడుతుంది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే పులులు గత కొద్ది రోజులుగా జనావాసాల్లో ఏదో ఒక చోట కనిపించడం, మరికొన్ని చోట్ల పాదముద్రలను అధికారులు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పెద్దపులి సంచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయదారులు, సామాన్య ప్రజానీకం, అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
పాదముద్రలతో గుర్తింపు : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం, కొండాపూర్ మూడు చెక్కలపల్లి, ఒల్లె నర్సయ్యపల్లి తదితర ప్రాంతాలలోని పొలాలలో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు అక్కడి రైతులు సమాచారం అందించారు. దీంతో అధికారులు పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తుందని నిర్ధారించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పనైంది.
డ్రోన్ కెమెరాతో వెతుకులాట : అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాలలో డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఆ ప్రాంతాలలోని పొలాలను జల్లెడ పట్టారు. ఎక్కడా పెద్దపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయిందని నిర్ధారించినప్పటికీ ఎప్పటికపుడు అప్రమత్తతో ఉండాలని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపులి గత అర్ధరాత్రి నర్సంపేట మండలం మీదుగా సంచరిస్తూ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు.