Alcoholic Teacher in Suryapet District :విద్యార్థి తప్పు తోవలో నడిస్తే, ఆ విద్యార్థిని మంచి నడవడిలోకి తీసుకొచ్చేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. ఎందుకంటే గురువు మాట విని చెడిపోయిన వాడు ఈ లోకంలో లేడు. ఎలాంటి వారినైనా మార్చగలిగే శక్తి కేవలం టీచర్‌కు మాత్రమే ఉంటుంది. అందుకే అన్నారు పెద్దలు 'మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ' అని. చెడు మార్గంలో వెళ్లే విద్యార్థులను కేవలం మాస్టారు మాత్రమే సక్రమమైన మార్గంలో నడపగలడు. బతుకు పాఠాలు నేర్పించాల్సిన అలాంటి ఉపాధ్యాయుడే చెడు వ్యసనాలకు బానిసైతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి?
విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువే ప్రతిరోజు పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడు. మద్యం ఒకటే కాదు స్కూల్లోనే పిల్లల ముందే ధూమపానం సేవించడం వంటివి చేస్తున్నాడు. దీంతో విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచరే ఇలా అయితే ఎలా అని మదనపడుతున్నారు. 'ఎప్పుడు మారతారు మా సారు' అంటూ వారిలో వారే ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలో జరిగింది.
తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, ఉపేందర్ అనే ఉపాధ్యాయుడు రామాపురం తండాలో ఎస్జీటీగా గత మూడేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ టీచర్‌కు మద్యం లేనిదే పూట గడవదు. ప్రతి రోజు పాఠశాలకు మద్యం సేవించి వస్తుంటారు. అంతటితో ఆగక స్కూల్‌కు వచ్చిన తర్వాత పిల్లల ముందే మద్యం తాగుతాడు. అక్కడే సిగరేట్ వెలిగించి విద్యార్థులు చూస్తుండగానే కాలుస్తాడు. తాగిన మైకంలో పాఠశాల గదుల్లోనే నిత్యం పుష్టిగా పడుకోవడం చేస్తున్నాడు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎంత చెప్పినా నిత్యం ఇదే తంతు కొనసాగిస్తున్నాడు.