Software Employee Mango Organic Farming : ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగానికే ప్రాధాన్యత ఇచ్చే యువతీ యువకులు ప్రస్తుతం వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారు. పని ఒత్తిడి నుంచి సేద తీర్చుకోవడానికి వ్యవసాయ క్షేత్రం సరైన ప్రాంతమని అనుభవ పూర్వకంగా తెలుసుకుని ఇతరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంకొకవైపు తనకు ఇష్టమైన వ్యవసాయ సేంద్రీయ పద్ధతిలో మామిడి తోట సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన సిరిపురం చైతన్య నిలుస్తున్నాడు. అతను నాలుగేళ్లు పడిన కష్టానికి ఈ ఏడాది ఫలితం వచ్చింది.
తన తాతయ్య సిరిపురం వెంకట నరసయ్యను స్ఫూర్తిగా తీసుకొని సాగు బాట పట్టినట్లు చైతన్య తెలిపారు. అమ్మానాన్న చనిపోయాక తాను తాతయ్య వద్దనే పెరిగినట్లు చెప్పాడు. మేమిద్దరం అన్నదమ్ములం, ఒక చెల్లి ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యామన్నారు. వయసు పెరుగుతున్న కొలదీ తాతయ్య వద్ద ఉండాలన్న కోరిక తనలో బలంగా పెరిగిందని అన్నారు. అప్పుడప్పుడు వారాంతపు సెలవుల్లో వచ్చి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేవాడిని అలా కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చినప్పుడు తాతయ్య వద్ద ఈ మామిడి పంట గురించి తెలుసుకున్నానని చెప్పారు.
గతంలో బంగినపల్లి, దసేరి సాగు చేసేవాళ్లమని అయితే చీడపీడలు పట్టడంతో అనేక నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని యువరైతు సిరిపురం చైతన్య తెలిపారు. ఈ క్రమంలో చీడపీడలు బారిన పడకుండా నూతన రకాల కోసం పలు ప్రాంతాల్లో అన్వేషణ మొదలుపెట్టానన్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి కేసరి అనే నూతన రకాన్ని తీసుకొచ్చి 2019లో 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో మొక్కలు పెంపకం మొదలుపెట్టామన్నారు. ప్రతి మొక్కకు డ్రిప్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని వినియోగిస్తూ తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి పొందే విధంగా యత్నిస్తున్నట్లు చైతన్య తెలిపారు.