Pet Dog Theft in Peddapalli : పెంపుడు జంతువులను పెద్దపెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఎంత పని ఉన్నా వాటికి కొంత సమయం కేటాయిస్తుంటారు. ఆ జాబితాలో కుక్కలది ప్రత్యేక స్థానం. మూగ జీవాలలో అత్యంత విశ్వాసమైన జంతువుల్లో కుక్కకే తొలి ప్రాధాన్యం. అందుకే శునకాలను చాలామంది ప్రేమతో పెంచుకుంటారు. కొంతమంది పెంపుడు కుక్కలను ఇంట్లో మనిషిలా స్థానం ఇచ్చి మరి చూస్తుంటారు.
అలాంటి పెంపుడు జంతువులకు బయట మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే అడపాతడపా వీటిని దొంగలించే వారు ఉన్నారు. బయటి మార్కెట్లో అమ్ముకునేందుకు కొందరు, తామే పెంచుకునేందుకు మరికొందరు ఇలా చోరీలకు పాల్పడుతుంటారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హచ్ బ్రీడ్‌కు చెందిన ఓ పెంపుడు కుక్క చోరీకి గురైంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అప్పరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కను శనివారం (నవంబర్ 02)న మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఓ బైక్ పై వచ్చి అపహరించారు.
సీసీ ఫుటేజీలో రికార్డు : ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై వెళ్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న హచ్ కుక్కను చూసి దానిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ గ్యాంగ్‌లో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం. ఎవరి కంట పడకుండా ఆమె చున్నితో కుక్కను దాచిపెట్టింది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కుక్క చోరీకి గురైందనే బాధతో రెండ్రోజులుగా యజమాని అప్పరి నారాయణ కుటుంబం తీవ్ర నిరాశలో ఉందని తెలిపారు. నారాయణకు ఇద్దరు కూతుర్లు ఉండగా పెంపుడు కుక్కను మూడో కూతురుగా పెంచుకుంటున్నామని అన్నారు. దయచేసి తమ కుక్కను తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.