Smartphone Theft In Mahabubabad: ఓ ఆగంతకుడు ఇద్దరిలా నటించి వ్యాపారిని బురిడీ కొట్టించాడు. ఓ వ్యక్తి వ్యాపారికి మొబైల్లో తాను రైల్వే అధికారినని చెప్పి తనకు ఒక కొత్త ఫోను కావాలని అడిగాడు. వాట్సప్‌లో ఓసారి లోకో పైలట్, మరోసారి జేఈగా మెసేజ్ చేశాడు. అనుమానం రాకుండా వ్యవహరించి చివరకు తానున్న చోటుకు వ్యాపారిని రప్పించుకుని ఏకకాలంలో ‘ఇద్దరి’లా నటించి స్మార్ట్‌ఫోను కొట్టేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ మోసం డోర్నకల్‌లో జరిగింది.
ద్విపాత్రాభినయంతో బురిడీ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో వ్యాపారి అభిషేక్‌జైన్‌కి ఓ సెల్ పాయింటు ఉంది. డిసెంబరు 20న ఓ వ్యక్తి చరవాణిలో తన పేరు శ్రీనివాసరావు అని రైల్వే అధికారినని పేర్కొని వీవో వీ40 రకం మొబైల్ కావాలన్నాడు. ధర, రాయితీ తదితర వివరాలు అడిగాడు. ఆ వ్యాపారి ధర చెప్పి నీలం రంగు ఫోను ఉందని తెలియజేశారు. తనకు పర్పుల్ రంగు ఫోన్ తెప్పించాలని కోరుతూ పది రోజుల్లో ఫోన్ చేస్తానన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాట్సప్ ఛాటింగ్ కూడ జరిగింది.
సినీఫక్కీలో ఘటన : సరిగ్గా 18 రోజులకు కొత్త ఫోను తెచ్చారా? సెల్ పాయింటుకు వస్తున్నట్లు అతడు ఫోన్ చేశాడు. మళ్లీ ఫోను చేసి విధి నిర్వహణలో తీరిక లేదని మొబైల్ తెస్తే ఇక్కడే డబ్బులు ఇస్తానని చెప్పాడు. రైల్వేస్టేషన్ లోపలి ఓ కార్యాలయం చిరునామా చెప్పాడు. కొత్త ఫోనుతో వెళ్లిన వ్యాపారి ఆ అధికారికి ఫోన్ చేయగా బిజీగా ఉన్నానని, తన సహాయకుడిని పంపిస్తున్నట్లు తెలిపాడు. రైల్వే కార్మికుడి దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి వచ్చి సార్‌కి కాల్ చేసింది మీరేనా? అని పలకరించాడు. ఇక్కడే కూర్చోండి సార్ వస్తారు అని చెప్పి విశ్రాంతి గదిలో కూర్చోబెట్టి వెళ్లాడు.