Leopard Killed Goat in Sathyasai District:రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా చిరుత పులులు సంచరిస్తూ ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఇంటి ఆవరణలో, పొలాల్లో ఎక్కడబడితే అక్కడికి చొరబడి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం చిరుత దాడులకు గురై ఎంతోమంది అమాయకులైన ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈసారి చిరుత దాడిలో ఓ మేక బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.
చిరుత దాడిలో మేక మృతి:శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో వ్యవసాయ రైతు నారాయణప్పకు చెందిన మేకపై చిరుత దాడి చేసి చంపేసింది. ఇంటి వెనక కట్టేసిన మేకను చిరుత అమాంతం ఎత్తుకెళ్లి సగభాగం తినేసి కళేబరాన్ని వదిలేసి వెళ్లింది. ఈ విషయాన్ని రైతు, స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని చిరుత ఎక్కడెక్కడ సంచరిస్తుందో పరిశీలించారు. తరువాత మేకకు పోస్ట్మార్టం నిర్వహించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని వెల్లడించారు.