Man killed By Friends in kukatpally : ప్రేమకు అడ్డొస్తున్నాడని భావించి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని రైలుపట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశారు. 10 మంది నిందితులను అల్లాపూర్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులంతా 20 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్లోని సఫ్దనగర్కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్ (17) యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చదువుతున్న దివంగత రౌడీషీటర్ కుమారుడితో పాటు మరికొందరితో డానీష్కు స్నేహం ఉంది. రౌడీషీటర్ కుమారుడు పదో తరగతి ఫెయిల్ కావడంతో మిగితా వారి కంటే విద్యలో ఒక సంవత్సరం వెనకబడి ఉన్నాడు.
అయితే రౌడీషీటర్ కుమారుడికి అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయితో బంధుత్వం ఉంది. అదే అమ్మాయితో డానీష్ ఫ్రెండ్లీగా ఉండేవాడు. అది చూసి ఇతను తట్టుకోలేకపోయేవాడు. ఈ విషయంపై డానీష్కు అతడికి చాలా సార్లు గొడవ కూడా అయింది. నేను పెళ్లి చేసుకునే అమ్మాయితో నువ్వేందుకు తిరుగుతున్నావ్ అంటూ పలుమార్లు ఇతను డానీష్తో గొడవకు దిగినట్లు సమాచారం. అయితే ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన డానీష్ తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో డానీష్ మృతదేహం లభ్యమైంది. హత్య కావొచ్చని తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.