తెలంగాణ

telangana

ETV Bharat / state

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పత్రాలన్నీ దగ్గర ఉంచుకోండి - FAMILY SURVEY IN TELANGANA

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి - 75 ప్రశ్నలతో కుటుంబ సర్వే ఫారమ్ - ఫొటోలు, పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు

Comprehensive Family Survey in Telangana
Comprehensive Family Survey in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 12:42 PM IST

Comprehensive Family Survey in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఈ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయ సమాచారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఏం సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఇలాంటి మీ సందేహాలను నివృత్తి చేసేందుకే ఈ కింద ఇచ్చే సమాచారం ఒకసారి చదవండి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది.

సర్వే నిర్వహణ ఇలా : సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి సమాచారం సేకరిస్తారు. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం రెండు పార్టులు అంటే పార్టు-1, పార్టు-2గా ఉండి ఎనిమిది పేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం అడగనున్నారు. అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.

సమగ్ర కుటుంబ సర్వే (ETV Bharat)

ధరణి ఖాతా, ఎకరాల వివరాలు చెప్పాల్సిందే : భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్​కు చెప్పాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం వివరాలు అనగా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.

రిజర్వేషన్​ ఫలాలు పొందేవారు : విద్యా, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ విధానంతో ప్రయోజనం పొందినా, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాలు, ఆ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్ల్యూఎస్​ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు.

సమగ్ర కుటుంబ సర్వే (ETV Bharat)

రాజకీయ నేపథ్యం : ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం, పూర్వం ఏ పదవిలో ఉన్నారనేది తెలుసుకుంటారు. పదవీ కాలం, నామినేటెడ్ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.

ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి : ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్​ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పుడు సులువుగా వివరాలు అందించవచ్చు.

వలసలు :ఒక కుటుంబంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా ఆరా తీస్తారు.

సమగ్ర కుటుంబ సర్వే (ETV Bharat)

ఫొటోలు తీయరు - పత్రాలు తీసుకోరు : సర్వే సందర్భంగా ప్రతి కుటుంబం ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు, పత్రాలు వంటివి తీసుకోరు. అలాగే కుటుంబీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయిస్తే సరిపోతుంది. వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

ఈ సమాచార సేకరణ :

  • ఐదేళ్లలో రుణాలు ఎందుకు తీసుకున్నారు. (ఎక్కడి నుంచి రుణాన్ని పొందారు)
  • ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే ఆ వివరాలు
  • పశుసంపద సంఖ్య
  • చరాస్తి, స్థిరాస్తి వివరాలు
  • రేషన్ ​కార్డు నెంబరు (ఉంటేనే)
  • నివసించే నివాసం విస్తీర్ణం (చదరపు గజాల్లో), గదుల సంఖ్య, నివాసరకం, విద్యుత్​ సదుపాయం
  • తాగునీటి వనరు
  • మరుగుదొడ్డి
  • వంట కోసం ఏ ఇంధనం వినియోగిస్తారు

సాధారణ వివరాలు నమోదు చేసినప్పుడు తీసుకునే వివరాలు :

  • కుటుంబ యజమాని
  • సభ్యుల పేర్లు
  • సంబంధం
  • మతం
  • సామాజికవర్గం
  • వయసు
  • మాతృభాష
  • ఆధార్‌కార్డు నెంబరు (ఐచ్ఛికం)
  • మొబైల్‌ నెంబర్
  • దివ్యాంగులైతే వైకల్యం
  • వైవాహిక స్థితి
సమగ్ర కుటుంబ సర్వే (ETV Bharat)

విద్యా వివరాల నమోదులో : పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏ మాధ్యమంలో చదివారని తెలియజేయాలి. ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.

ఉద్యోగ, ఉపాధి వివరాలు :ఈ విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతం చేసే పని, ఉద్యోగం, వృత్తి, ఉపాధి సమాచారం ఇవ్వాలి. వార్షికాదాయం, ఒకవేళ వ్యాపారులైతే వార్షిక టర్నోవర్ తెలియజేయాలి. సాంప్రదాయ కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా, కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా, లేదా తెలియజేయాలి.

'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్​ చెకప్​లా ఉపయోగపడుతుంది'

తెలంగాణలో కులగణనకు డేట్​ ఫిక్స్ - ఏమేం అడుగుతారంటే?

ABOUT THE AUTHOR

...view details