70 Years Old Woman Athlete From Nellore District : సాధారణంగా 60 ఏళ్లు వచ్చాయంటే చాలు రామా, కృష్ణా అంటూ చాలా మంది పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు. అంతెందుకు యువత సైతం కొంచెం దూరం నడిచినా వర్కవుట్ చేసినా ఇట్టే అలసిపోతారు. ఆమె మాత్రం ఏడు పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా అలుపెరగకుండా పరుగులు తీస్తున్నారు. క్రీడలకు వయసు అడ్డురాదంటూ ప్రపంచ రికార్డులు సాధించి ఔరా అనిపిస్తున్నారు.
నవ్వుతూ ఎంతో చలాకీగా కనిపిస్తున్న ఆమె పేరు సుహాసిని. వయసెంతో తెలుసా? 70 పైమాటే. పేరుకు తగ్గట్టుగానే అడుగు పెట్టిన ఏ మైదానంలోనైనా విజయం ఎప్పుడు ఆమె వైపే ఉంటుంది. సుహసిని అడుగుపెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. పరుగందుకుంటే పతకం పట్టాల్సిందే. ప్రపంచంలో ఏ మూల పోటీ జరిగినా వాలిపోతారు. మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మెడల్స్ కొల్లగొడుతున్నారు. ఆగస్టులో స్వీడన్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
లక్ష్మీ సుహాసిని సొంతూరు గుంటూరు అయినా నెల్లూరులో స్థిరపడ్డారు. తెలుగు లెక్చరర్‌గా పని చేసిన ఈమె పదవీ విరమణ తర్వాత వెటరన్ క్రీడాకారిణిగా మారారు. మోకాలికి శస్త్రచికిత్స జరిగినా ఏమాత్రం బెరుకు లేకుండా జావెలిన్ త్రో, డిస్క్ త్రో, మారథాన్ వాకింగ్‌లో కఠోర శ్రమ చేశారు. నేటికీ 5కె రన్, రిలే రన్ పోటీల్లో శిక్షణ పొందుతున్నారు. క్రీడలకు వయసు అడ్డురాదని చాటిచెబుతున్నారు.