Instant Pesarattu Mix Preparation in Telugu : పెసరట్టు వేసుకోవాలంటే ముందురోజు పెసలు నానబెట్టి, మార్నాడు రుబ్బి కాస్త పులియబెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కమ్మటి పెసరట్టు ఎంజాయ్ చేయచ్చు. అయితే, అలా కాకుండా ఇక్కడ చెప్పిన విధంగా ఓ పొడి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు పెసరట్టు వేసుకోవచ్చు. పైగా ఈ పెసరట్టు పొడి రెండు నెలలు నిల్వ ఉంటుంది. మరి సింపుల్‌గా ఇన్స్టంట్ పెసరట్టు మిక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - పావు కప్పు
- పెసర్లు - 2 కప్పులు
- పచ్చిమిర్చి - 3
- అల్లం - అంగుళం ముక్క
- కరివేపాకు - 1 రెమ్మ
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో బియ్యం, పొట్టు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. అనంతరం వాటిని ఫ్యాన్ కింద పొడి క్లాత్‌పై పలుచగా పరచి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టుకొని ఆరబెట్టుకున్న పెసర్లను వేసుకొని లో ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- తర్వాత వాటిని బౌల్లోకి తీసుకుని చల్లార్చాలి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని లో ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకోవాలి. ఆపై జీలకర్రను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని పెసర్ల గిన్నెలో వేసుకోండి. ఇందులోనే ఉప్పు, ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని కొద్దికొద్దిగా చల్లారిన పెసర్ల మిశ్రమాన్ని వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఎయిర్‌టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి.
- ఈ పొడి రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది.
ఇన్స్టంట్ మిక్స్‌తో పెసరట్టు ఇలా వేయండి!
- మీరు పెసరట్టు వేసుకోవాలనుకున్నప్పుడు మిక్సింగ్ బౌల్లో అరకప్పు చొప్పున పెసరట్టు మిక్స్, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఇందులో కొద్దిగా ఉప్పు, వాటర్ యాడ్ చేసుకొని పిండిని దోశల పిండిలా మిక్స్ చేసుకోవాలి.
- బౌల్‌పై మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టాలి.
- తర్వాత వేడివేడి పెనంపై కొద్దిగా ఆయిల్ వేసి గరిటెతో పిండి వేసి పెసరట్టు వేసుకోండి.
- ఆపై పెసరట్టు మీద కొద్దిగా సన్నని ఉల్లిపాయ తరుగు, కాస్త ఆయిల్ వేసుకొని ఒకవైపు చక్కగా కాల్చుకోవాలి.
- అనంతరం రెండో వైపునకు టర్న్ చేసుకొని లైట్‌గా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ "పెసరట్టు" రెడీ!
అద్దిరిపోయే చిట్టిచిట్టి "పెసర పునుగులు" - ఈ అల్లం చట్నీతో తింటే టేస్ట్ అదుర్స్!
నిమిషాల్లో మెత్తని "సగ్గుబియ్యం దోశలు" - ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!