Farmers Attack On Officials In Vikarabad :ఔషధ (ఫార్మా) పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు.
వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి : సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై కొంతమంది రైతులు కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకోగా, ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను తప్పించేందుకు యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పైనా దాడి చేశారు. ఔషధ పరిశ్రమకు భూసేకరణ చేపట్టాలని వెళ్లిన అధికారులపై దాడి ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. వికారాబాద్ జిల్లాలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
రాష్ట్రాభివృద్ధికి ఎవరు అడ్డుపడుతున్నారో తేలుస్తాం :మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, అధికారం రాలేదనే ఉక్రోశంతోనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ విధానాలు నచ్చకుంటే తాము న్యాయ పోరాటం చేశాము కానీ, దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో రైతులను కొందరు రెచ్చగొట్టి, కలెక్టర్‌పై భౌతికదాడికి పాల్పడేలా చేశారన్నారు. పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చాక నిందితులపై చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు వెల్లడించారు.