Wedding Season Business In November 2024 : మరో రెండు నెలల్లో పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. నవంబరు, డిసెంబరు మాసాల్లో సుమారు 35 లక్షల పెళ్లిళ్లకు బాజాభజంత్రీలు మోగబోతున్నాయి. ముఖ్యంగా భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికి లేదంటే అతిశయోక్తి లేదు. పేదవాడి నుంచి కుబేరుడి వరకు తమ పిల్లల పెళ్లిని గ్రాండ్‌గా జరపాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో తాహతుకు మించి ఖర్చు చేస్తారు.
ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, అలంకరణ సామగ్రి అంటూ నానా హడావుడి చేస్తారు. అలాగే కార్లు, మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటల్ బుకింగ్స్ వరకు చాలానే ఖర్చు చేయాలి. అందుకే పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అన్నారు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ల సీజన్‌ను వ్యాపార సంస్థలు అతిపెద్ద బిజినెస్‌గా ఎంచుకున్నారు. ఈ రెండు నెలల సీజన్లోనే ఏకంగా రూ.4 లక్షల కోట్ల పైబడి లావాదేవీలు జరగనున్నాయి.
కార్పొరేట్ సంస్థల ఫోకస్ :ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లలో వస్తున్న భారీ లాభాలను చూసి కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశిస్తున్నాయి. ఇంతకాలం వ్యక్తులు, చిన్న సంస్థలు మాత్రమే పెళ్లిళ్లకు సంబంధించిన సేవలను అందించేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ రంగం ప్రవేశంతో ఇది సంఘటిత రంగంగా మారిపోతోంది. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులు, ఉపకరణాలు అందించే ప్రైవేట్ సంస్థలు ఎప్పటి నుంచే వాటి కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ సంస్థలు ఏటా నమోదు చేసే వ్యాపారంలో సగానికి పైగా టర్నోవర్ పెళ్లిళ్ల సీజన్ నుంచే వస్తోంది.
ఈ దసరా పండుగ తర్వాత 15 రోజుల తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది. ముఖ్యంగా నవంబరు, డిసెంబరు నెలల్లో అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. వీటిపై రూ.4.25 లక్షల కోట్ల వ్యయం చేయనున్నారని ఆర్థిక సేవల సంస్థ అయిన ప్రభుదాస్ లీలాధర్ తాజా నివేదికలో అంచనా కట్టారు.