200 Units Free Electricity In Telangana: గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబరు అనుసంధానమై కరెంటు కనెక్షన్లు ఉన్న ఇళ్లకు తొలిదశలో ‘గృహజ్యోతి’ కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని సర్కారు కసరత్తు చేస్తోంది. దీనికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో మీటర్ రీడర్‌లు ఇంటింటికీ తిరిగి గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇటీవలె ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులిచ్చారు. వీటిలో చాలా మంది రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేసుకోలేదు. దీనికోసం విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు.
అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ
Gruha Jyothi Free Current : దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్‌కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడే కనెక్షన్లు 30 లక్షల వరకు ఉన్నాయి. కానీ 19.85 లక్షల మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలు లేవు. సుమారు 10 లక్షల మంది దరఖాస్తు పెట్టుకోలేదు.