17 Years Old Student Died : ఇంటర్నెట్ కాలంలో చిన్న చిన్న కారణాలతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు మందలించారనో, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదనో, వారు కావాలనుకున్నది కొనివ్వలేదనో, ప్రేమించిన మనిషి మోసం చేశారనో, భార్యభర్తల కలహాల వల్ల ఇలా ఏమీ ఆలోచించకుండా ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది.
ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలోకి ఎంతో సంతోషంతో అడుగు పెట్టాం. ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొని, అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం. కానీ స్నేహితురాలు తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదని ఓ విద్యార్థిని (17) మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది.
మనస్తాపానికి గురై ఆత్మహత్య :అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన విద్యార్థిని బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ, అక్కడే వసతి గృహంలో ఉంటోంది. ఆమెకు అదే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య స్నేహం కుదిరింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ చదువుకునేవారు. జనవరి 1 మంగళవారం రాత్రి వసతి గృహంలో విద్యార్థులు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఫ్రెండ్ ఆమెకు శుభాకాంక్షలు తెలపలేదు. ఈ కారణంతో విద్యార్థిని మనస్తాపానికి గురై బుధవారం తెల్లవారుజామున భోజన శాలలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.