Central Finance Commission Chairman Arvind Panagariya On Meeting Points :రుణాల రీస్ట్రక్చరింగ్ లేదా అదనపు రుణాలకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, ఆ అంశంపై అధ్యయనం చేస్తామని 16వ కేంద్ర ఆర్ధిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగఢియా తెలిపారు. ఆరో రాష్ట్రంగా తెలంగాణలో కమిషన్ పర్యటిస్తోందని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అన్ని అంశాలను కమిషన్కు ప్రభుత్వం వివరించిందని చెప్పారు. రుణాలు, రుణభారం గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు బాగున్నాయని కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగఢియా ప్రశంసించారు. ఎక్కడైనా పట్టణాభివృద్ధిని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తారని కానీ, తెలంగాణ మాత్రం పట్టణాభివృద్ధికి మంచి ప్రాధాన్యం ఇస్తోందని కితాబిచ్చారు. సెస్, సర్ ఛార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని పనగఢియా వెల్లడించారు.
ప్రోత్సాహకం ఇవ్వాలని తెలంగాణ, కర్ణాటక కోరాయి.. పరిశీలిస్తాం :మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, ప్రోత్సాహకం ఇవ్వాలని తెలంగాణ, కర్ణాటక కోరాయన్న ఆయన వాటిని పరిశీలిస్తామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం డివిజబుల్ పూల్లో 41 శాతం నిధులు సిఫారసు చేసిందని, ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో రాష్ట్రాల, ఆయా రంగాలకు ప్రత్యేకంగా సిఫారసు చేసిన గ్రాంట్లు మాత్రమే రాలేదని, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఛైర్మన్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తగిన సిఫారసులు చేస్తామని అరవింద్ పనగఢియా తెలిపారు.