Speedy Road Widening Works: నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి నిర్మల్ జిల్లా బాసర మీదుగా భైంసా వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బోధన్ నుంచి భైంసా వరకు 56.4 కిలోమీటర్ల మేర రూ.544.45 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు ప్రారంభించారు. 2022 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ జాతీయ రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. బోధన్, నిజామాబాద్, బైంసా రెవెన్యూ డివిజన్ల అధికారులు సర్వే, భూసేకరణ పూర్తి చేశారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ జాతీయ రహదారి పనులు 10 మీటర్ల వెడల్పుతో సాగుతున్నాయి.
Construction Of Four Bypasses :బోధన్ - భైంసా జాతీయ రహదారి విస్తరణలో ఇతర మార్గాలను కలిపేందుకు మొత్తం నాలుగు బైపాస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బోధన్ మండలం ఆచన్‌పల్లి వద్ద మొదటి బైపాస్, పెగడపల్లి సమీపంలో రెండో బైపాస్, రెంజల్ మండలం సాటాపూర్ వద్ద మూడో బైపాస్, నవీపేట మండలం ఫకీరాబాద్ వద్ద నాలుగో బైపాస్ నిర్మాణం జరుగుతుంది. ఫకీరాబాద్ రైల్వే గేటు వద్ద ఆర్ఓబీ నిర్మాణం, గోదావరి నది మీదుగా బాసర మార్గంలో మరో కొత్త వంతెన నిర్మాణం జరుగుతోంది.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు :కొన్నిచోట్ల రహదారి పనులు పూర్తవ్వడంతో వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నారు. 2025కి ఈ జాతీయరహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రహదారి విస్తరణతో మేలు జరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణతో భూముల విలువలు పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి వాహనదారులకు మేలు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.