Student Dies OF Food Poison in Telangana :పాఠశాలలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారం వల్ల మృత్యువాత పడింది. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుతుందన్న కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. అక్టోబర్ 30న తెలంగాణలోని వాంకిడి ఆశ్రమ పాఠశాలలో సహచర విద్యార్థులతో భోజనం చేసి శైలజ (16) అనే విద్యార్థిని 21 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. కళ్ల ముందే కన్న కుమార్తె చనిపోవడంతో ఆ తల్లి పెట్టిన రోదన ఆకాశాన్నంటింది. విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ విపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
Gurukul Student Sailaja Died at NIMS Hospital :హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తెలంగాణలోని కుమురం భీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో తోటి విద్యార్థులతో భోజనం చేసిన శైలజ అస్వస్థతకు గురైంది. పలువురు చిన్నారులను సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం అందించారు. మిగతా వారు కోలుకున్నా శైలజ పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కి తరలించారు. 21 రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ విద్యార్థిని మృత్యువాత పడింది. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన కుమార్తె పరిస్థితి మరొకరికి కలుగకుండా చూడాలని ఆ తల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలిచివేసింది.
ఆ వంటకం తిని మహిళ మృతి - మరో 50 మంది ఆస్పత్రికి - నందినగర్‌లో దారుణం
విచారణ చేపట్టిన అధికారులు :బాలికలు అస్వస్థతకు గురై దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ అధికారులు కారణాలను వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు విచారణలో భాగంగా ఆహార పదార్థాల నమూనాలు సేకరించి అన్ని బాగున్నట్లు నివేదిక అందించారు. విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల వల్లే అనారోగ్యానికి గురయ్యారంటూ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే వాదనలూ వినిపించాయి. ఘటన జరిగిన రోజే విచారణ చేపడితే బాగుండేదని విద్యార్థినుల తల్లిదండ్రులు అంటున్నారు. కలుషితానికి గల కారణాలను అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.