Hyderabad Kidney Racket Case Updates : హైదరాబాద్‌లో కిడ్నీ అక్రమ మార్పిళ్ల కేసు కలకలం సృష్టిస్తోంది. దీనిపై తీగ లాగితే డొంక విశాఖలో కదులుతోంది. నగరానికి చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లకు ఈ కేసుతో సంబంధమున్నట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. పెందుర్తిలోని ఓ ఆసుపత్రిలో అనధికారికంగా కిడ్నీ తొలగించారని 2023లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో 10 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి సీపీ త్రివిక్రమ వర్మ బదిలీపై వెళ్లిపోయిన తర్వాత ఆ ముఠా కార్యకలాపాలపై ఎవరూ ఫోకస్ పెట్టలేదు. అప్పట్లో సూత్రధారులు బయటకు రాకుండా లోతైన దర్యాప్తు జరగకుండా పోలీసులు కేసును పక్కన పెట్టేశారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా కిడ్నీ రాకెట్ బయటపడటంతో ఇప్పటికీ విశాఖ నుంచి ముఠాను నడిపిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మళ్లీ అదే వైద్యుడు : విశాఖపట్నంలో అప్పట్లో కలకలం సృష్టించిన కేసులో చెన్నైకు చెందిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాళ్లను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందిస్తుంటారు. కిడ్నీ ముఠా ప్రణాళిక ప్రకారం ఆయన పెందుర్తి వచ్చి అప్పట్లో బాధితుడికి శస్త్రచికిత్స చేసి కిడ్నీ తొలగించారు. తాజాగా హైదరాబాద్ కేసులోనూ అదే వైద్యుడికి సంబంధమున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 2023లో కిడ్నీ రాకెట్ కేసులో పవన్ అనే వ్యక్తికి సంబంధముందని పోలీసులు గుర్తించారు. అతడికే హైదరాబాద్ కేసుతో సంబంధముందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ల్యాబ్ సిబ్బంది పాత్రపై ఆరా : గతంలో విశాఖలో కిడ్నీ ముఠాకు సహకరించిన ల్యాబ్ సిబ్బంది పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రక్తపరీక్షలు చేసి క్రాస్ మ్యాచింగ్ కోసం హైదరాబాద్‌కు నమూనాలు పంపేవారు. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత నగరంలో ఆపరేషన్లు చేయడంతో ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అప్పట్లో వైద్యారోగ్యశాఖ నగరంలోని కొన్ని ఆసుపత్రులను తనిఖీ చేసింది. బాధితులు, గ్రహీతల వివరాలను సేకరించింది. తాజాగా పోలీసులు ఆ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. వాటి ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని భావిస్తున్నారు.
kidney case విశాఖ కిడ్నీ రాకెట్ కేసు.. ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్.. ఎవరంటే?