Shubman Gill Duleep Trophy:2024 దులీప్ ట్రోఫీ గురువారం మొదలు కానుంది. ప్రారంభ మ్యాచ్‌లో ఇండియా A జట్టుకు నాయకత్వం వహించడానికి శుభ్‌మన్ గిల్ సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్‌లో గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దులీప్ ట్రోఫీతో రెడ్-బాల్ క్రికెట్‌లో ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. తాజాగా గిల్ తన టెస్ట్ క్రికెట్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
'అంచనాలు అందుకుంటా'
గిల్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.' టెస్ట్ క్రికెట్‌లో, నా ప్రదర్శన ఇప్పటివరకు నా అంచనాలకు అనుగుణంగా లేదు. కానీ మేము ఈ సీజన్‌లో 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతున్నాం. ఆ 10 టెస్టుల తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నా అంచనాలకు సరిపోతాయని ఆశిస్తున్నాను' అన్నాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో గిల్, ఇండియాకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20లకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ గిల్ అని ప్రచారం మొదలైంది.
'కెప్టెన్, వైస్ కెప్టెన్ ఏదైనా ఒకటే'
'మీరు ఆడే ప్రతి మ్యాచ్ లేదా టోర్నమెంట్‌లో మీరు కెప్టెన్ లేదా కాదా అనే దానితో సంబంధం లేకుండా మీ గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తారు. కెప్టెన్ అయితే, ఇతర ఆటగాళ్ల గురించి కూడా తెలుసుకుంటారు. కెప్టెన్‌కు ఆటగాళ్లతో సన్నిహితంగా ఉండటం ముఖ్యం. మీరు వారి బలాలు, బలహీనతలను తెలుసుకోవాలి. అవును అలాంటి కన్వర్జేషన్లు జరుపుతున్నప్పుడు, కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాలో కొన్ని మార్పులు వచ్చాయి. నిజంగా అదనపు ఒత్తిడి కాదు. నేను కెప్టెన్‌గా ఉన్నా, వైస్ కెప్టెన్‌గా ఉన్నా బ్యాటర్‌గా నా పాత్ర మారదు. ఇదంతా జట్టు కోసం పరుగులు చేయడం గురించి మాత్రమే' అని గిల్ వివరించాడు.