Yashasvi Jaiswal Net Worth :ఇటీవలే రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా జట్టు అద్వితీయ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. హోరా హోరీగా జరిగిన పోరులో 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై రోహిత్ సేన భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ గెలుపు వెనక కీలక పాత్ర పోషించింది మాత్రం యూపీకి చెందిన 23 ఏళ్ల యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్.
తాజాగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో యశస్వి వీరబాదుడికి ఇంగ్లీష్ ప్లేయర్లు హడలెత్తిపోయారు. అతడు సాధించిన డబుల్ సెంచరీ ఆ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే మ్యాచ్ ముగిసి 4 రోజులు అవుతోంది. అయినప్పటికీ నెట్టింట యశస్వి చేసిన సెంచరీ గురించే చర్చలు జరుగుతోంది.
2001 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్‌లోని భాదోహిలోని సూర్యవాన్‌లో జైస్వాల్ జన్మించాడు. పిన్నవయసులోనేన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ యంగ్ ప్లేయర్ క్రికెట్లో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు ముంబయికి పయనమయ్యాడు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అయితే జైస్వాల్‌లోని ట్యాలెంట్‌ను గుర్తించిన కోచ్ జ్వాలాసింగ్ అతడ్ని ప్రోత్సహించాడు. కొంత కాలానికి యశస్వి అండర్ 19 ఇండియా జట్టులో స్థానాన్ని దక్కించుకున్నాడు. తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు దృష్టిని ఆకర్షించాడు. 2020 వేలంలో ఆ ఫ్రాంచైజీ ఈ యంగ్ ప్లేయర్‌ను రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2022లోనూ రాజస్థాన్ జట్టు జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది.
అయితే 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరినీ అబ్బురపరిచాడు. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ లాంటి స్టార్ ప్లేయర్ల రికార్డును ఈజీగా బద్దలు కొట్టాడు. ఇక ఈ హాఫ్ సెంచరీ యశస్వి కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. రాజస్థాన్ జట్టు ఐపీఎల్ టోర్నీలో రాణించకపోయినప్పటికీ జైస్వాల్ మాత్రం ఎప్పటికప్పుడు తన బెస్ట్ ఇస్తూ ఎన్నో రికార్డులను సాధించాడు. ఆ తర్వాత టీమ్ఇండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన సత్తా చాటుతున్నాడు.