Yashasvi Jaiswal Inspiration :యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే టీమ్ఇండియాలో అత్యంత కీలక ఆటగాడిగా మారాడు. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యికిపైగా స్కోరు సాధించిన ఇద్దరు బ్యాటర్లలో అతడిది రెండో స్థానం. ఫార్మాట్ ఏదైనా సరే దూకుడుగా ఆడడమే జైస్వాల్ తత్వం. అయితే ఇలాంటి యువ క్రికెటర్‌కు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మార్గదర్శిగా నిలిచాడట.
జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో విరాట్‌తోనే ఎక్కువగా మాట్లాడేవాడినని, అప్పుడు అతడు చెప్పిన మాటలు తనలో చాలా స్ఫూర్తి నింపాయని తాజాగా యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తొలిసారి వచ్చిన తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించాడు. జైస్వాల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'సీనియర్ క్రికెట్లో అడుగుపెట్టిన తర్వాత విరాట్‌తో ఒకసారి మాట్లాడాను. మూడు ఫార్మాట్లలో ఇన్నేసి మ్యాచ్‌లు ఆడటాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావని అడిగా. దానికి విరాట్ ఇచ్చిన సమాధానం ఎప్పటికీ మరిచిపోలేను. 'నేను మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నా. అందుకే నా దినచర్య కూడా ఓ పద్ధతిలో ఉండాలి. ఇందులో క్రమశిక్షణ అత్యంత కీలకం' అని అన్నాడు.