WOMENS T20 WORLD CUP 2024 India Women vs New Zealand :మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన మన అమ్మాయిల జట్టు తొలి మ్యాచ్‌లోనే తుస్సు మనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సేన టోర్నీని ఘోర పరాజయంతో ప్రారంభించింది. న్యూజిలాండ్‌పై మనకున్న పేలవ రికార్డును కొనసాగించింది. ఆ జట్టు చేతిలో మరోసారి ఓడిపోయి క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది.
సెమీస్ అవకాశాలపై పెద్ద దెబ్బే : ఈ పోరులో ఓటమి తేడా ఎక్కువ ఉండటం వల్ల భారత జట్టు సెమీస్ అవకాశాలకు పెద్ద దెబ్బే పడినట్టైంది. ఆడింది ఒక్క మ్యాచే, ఓటమి ఒక్కటే అయినా భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఎందుకంటే? - గ్రూప్-ఎలో ఉన్న జట్లలో ఏదీ తేలికైన జట్టు కాకపోవడమే.
ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో గ్రూప్ నుంచి సెమీస్‌కు అర్హత సాధిస్తుందని అంచనా ఉంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్ కాస్త బలహీనమైన జట్లు కాబట్టి భారత్, న్యూజిలాండ్‌ల్లో ఒకటి సెమీస్ చేరొచ్చని విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో ముఖాముఖి జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సెమీస్ బెర్త్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడేమో న్యూజిలాండ్ భారత జట్టును భారీ తేడాతో ఓడించి తన సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది.