Dravid Played For Scotland :టీమ్ఇండియా మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్‌ను క్రికెట్ ప్రియులు 'ది వాల్' గా అభివర్ణిస్తారు. అంతలా భారత్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ద్రవిడ్ అండగా నిలిచాడు. వరుసగా వికెట్లు కుప్పకూలిపోతున్నా, దిగ్గజ బౌలర్లను సైతం ఎదురొడ్డి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేవాడు. అయితే ద్రవిడ్ టీమ్ఇండియా తరఫునే కాకుండా స్కాట్లాండ్ తరఫున కూడా ఆడాడనే విషయం మీకు తెలుసా?
12 మ్యాచ్‌లు
2003 వన్డే ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్కాట్లాండ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు. 12 మ్యాచ్‌లలో 11 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసి 600 పరుగులు బాదాడు. అందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు ఏకంగా 66.66 ఉండడం గమనార్హం. అయితే ద్రవిడ్ ఆడిన 12 మ్యాచ్‌లో స్కాట్లాండ్ 11 మ్యాచుల్లో ఓటమిపాలైంది.
స్కాట్లాండ్ తరపున ఎందుకు ఆడాడు?
రాహుల్ ద్రవిడ్ స్కాట్లాండ్లో ఉన్న సమయంలో నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడగా వచ్చిన డబ్బు, ఇతర కార్యక్రమాల ద్వారా వచ్చిన నగదు మొత్తం కలిపి £45,000 యూరోలను సేకరించింది. ఈ మొత్తాన్ని ఛారిటీలకు అందించారు.