Dhoni Said This To yuvraj 6 sixes :టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే ఇన్నింగ్స్ 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు 6 సిక్సర్లు. 2007 సెప్టెంబరు 19న ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో మ్యాచ్‌లో ఆడిన ఈ ఐకానిక్ ఇన్సింగ్స్‌కు నేటితో 17 ఏళ్లు నిండాయి. అయితే యూవీ విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో మహీంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. అయితే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరో సిక్సర్ కొట్టిన వెంటనే మహీ అతడి వద్దకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశాడు. 'చూశావా నా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారీ నీ స్ట్రైక్ రేటు డబుల్ అవుతోంది' అని యువీతో వ్యాఖ్యానించాడట. ఈ విషయాన్ని యువీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఫ్లింటాఫ్ గొడవ గురించి!
అలాగే ఇంగ్లాండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ గురించి యూవీ వ్యాఖ్యానించాడు. అలానే ఫ్లింటాఫ్ ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో రెండు మంచి బాల్స్ వేశాడని, ఆఖరి బంతికి తాను సింగిల్ తీశానని యూవీ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే ఫ్లింటాఫ్ తనను ఏదో అన్నాడని, అది తనకు సరిగ్గా వినిపించలేదని తెలిపాడు. " ఏమన్నావ్? అని గట్టిగా అడిగాను. నాకు చాలా కోపం వచ్చింది. అయితే అంపైర్ వచ్చి గొడవ పడకుండా ఆపాడు. ఆ కోపంతోనే ప్రతీ బంతిని గ్రౌండ్ బయటపడేయాలని కసిగా కొట్టాను. మొదటి బంతి గ్రౌండ్ బయటపడింది. కోపంలో ఎంత గట్టిగా కొట్టానో కూడా తెలికుండా కొట్టేశాను. ఫ్లింటాప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మ్యాచ్ ముగిసిన తర్వాత నాతో గొడవ గురించి మాట్లాడాడు. అలాగే కరచాలనం చేశాడు. అప్పుడు నాకు ఫ్లింటాఫ్ పై మరింత గౌరవం పెరిగింది" అని యూవీ వ్యాఖ్యానించాడు.