Virat Kohli Wax Statue:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గురువారం (ఏప్రిల్ 18) జైపుర్ నహర్‌ఘర్ వాక్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగింది. మ్యూజియం ఫౌండర్, డైరెక్టర్ అనూప్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం బరువు 35 కేజీలు ఉంటుందని అనూప్ పేర్కొన్నారు. ఇక ఈరోజు (శుక్రవారం) నుంచి టూరిస్ట్‌లు చూడడానికి అనుమతి ఇచ్చారు.
టీమ్ఇండియా జెర్సీతో రెండు చేతుల్లో బ్యాట్ పట్టుకున్న విరాట్ విగ్రహం టూరిస్ట్‌లను ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటికే దిల్లీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహం ఉంది. ఈ మ్యూజియంలో క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనీ విగ్రహాలు ఉన్నాయి. ఇక మ్యూజియం నిర్వాహకులు గత వారం ఈ మైనపు విగ్రహ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. 'గత కొంతకాలం నుంచి పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి విరాట్ కోహ్లీ విగ్రహాన్ని తయారు చేయాలనే డిమాండ్ ఉంది. అందుకే ఈ విగ్రహం ఏర్పాటు చేశాం' అని మ్యూజియం ఫౌండర్ అనూప్ తెలిపారు.
కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే మహాత్మా గాంధీ, దలైలామా, రవీంద్రనాథ్ ఠాగూర్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, జాకీ చాన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మొదలగు 44 మంది ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి.