Virat Kohli Vs Sam Konstas Boxing Day Test : బాక్సింగ్ డే టెస్టు సమయంలో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సామ్ కాన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. కాన్‌స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం కాస్త వాగ్వాదానికి దారితీసింది. దీంతో అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా మధ్యలో దూరి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తాజాగా స్పందించారు. అతడిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కోరారు.
"కాన్‌స్టాస్ తన దారిన తాను వెళ్తున్నాడు. అయితే విరాట్‌ను చూడండి. అతడు తన డైరక్షన్‌ను మార్చుకున్నాడు. తను ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్. అత్యుత్తమ ఆటగాడు కూడా. అయితే భుజాలు తాకిన తర్వాత విరాట్ స్పందిస్తూ 'నేనెందుకు అలా చేస్తా?' అన్నట్లుగా అనిపించింది. అయితే ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలి" అని వాన్ వ్యాఖ్యానించాడు. "ఈ విషయంలో నాకు ఎటువంటి అనుమానాలు లేవు. విరాట్ నడుస్తున్న తీరును చూస్తే ఈజీగా అర్థమైపోతుంది" అని పాంటింగ్ అన్నాడు.