Virat Kohli In London : ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు అనే సస్పెన్స్‌కు తెరపడింది. తమకు ఫిబ్రవరి 15వ తేదీన రెండో సంతానం కలిగిందని, బాబు పేరు అకాయ్ అన్న విషయాన్ని తెలిపిన కాసేపటికే కోహ్లీ కెమెరాకు చిక్కాడు. విరాట్ ఫోటోను అతడి ఫ్యాన్స్ క్లబ్‌కు చెందిన ఓ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
విరాట్ కోహ్లీ లండన్‌లో ఉన్నట్లు అతడి ఫ్యాన్స్ క్లబ్ ఓ ఫొటోను పోస్ట్ చేసి క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫొటోలో విరాట్ ఓ లాంగ్ వింటర్ కోట్, క్యాప్‌లో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించాడు. అయితే ఇటీవలే అనుష్క శర్మ లండన్‌లో తన రెండో బిడ్డకు జన్మనివ్వనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలానే తమకు రెండో సంతానం కలిగిన విషయాన్ని కోహ్లీ, అనుష్క సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. కానీ, తాము ఎక్కడ ఉన్నది మాత్రం పక్కాగా చెప్పలేదు. అయితే తాజా పోస్ట్‌తో ఈ జంట లండన్ లో ఉన్నట్లు స్పష్టమైంది.
కోహ్లీ మొదట తాను ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనని చెప్పి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడు అసలు ఇండియాలోనే లేడని, సిరీస్‌కు అందుబాటులో ఉండటం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే కోహ్లీ సిరీస్ మొత్తం ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది.