Virat Kohli 2024 IPL: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని, టీ 20 వరల్డ్‌కప్ టైటిల్ కైవసం చేసుకుని మరిపించాలని రోహిత్ సేన కోరుకుంటోంది. ఈ క్రమంలో 2024 టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా? లేదా అన్నది కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. అయితే 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్‌కు దాదాపు 14 నెలలు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఏడాది అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో టీ20లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అందులో విరాట్ పెద్దగా ఆకట్టుకోలేదు.
అయితే అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అభిమానులను కలవరపరుస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే విరాట్ పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు ఓ అవకాశం ఉంది! అదే ఐపీఎల్. బెంగళూరు తరపున బరిలోకి దిగుతున్న కోహ్లీ ఈ సీజన్లో విశ్వరూపం ప్రదర్శిస్తే పొట్టి ప్రపంచకప్ జట్టులో విరాట్ స్థానం పదిలమే.
అవకాశాన్ని వదులుతాడా: ఐపీఎల్ సీజన్ 17 రాయల్ ఛాలెంజర్ బెంగళూరు- చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విరాట్ తన వన్డే ఫామ్‌ను కొనసాగిస్తే, అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఐపీఎల్‌లో మరో ఆరు పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 12,000 రన్స్ చేసిన ఆరో ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. టీ20ల్లో ఇంతటి ఘనమైన రికార్డులు ఉన్న కోహ్లీ అంత తేలిగ్గా వరల్డ్‌కప్ అవకాశాన్ని వదులుకుంటాడా? వదలడు! విధ్వంసం సృష్టిస్తాడు.
2022లోనూ అదుర్స్: ఒకసారి బరిలోకి దిగితే కోహ్లీ చెలరేగిపోతాడు అనటంలో అతిశయోక్తి లేదు. గత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్లో ఓడిపోయింది. అయినా విరాట్ లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా, ఓడిపోతామనుకొన్న పాకిస్థాన్ మ్యాచ్‌లో 53 బాల్స్‌లో 82 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందించాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 98.66 యావరేజ్‌తో 296 రన్స్ చేసిన కోహ్లి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగుల ఏకైక క్రికెటర్ కోహ్లీ.